Eating Healthy Day 2025 : శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండాలంటే.. తినాల్సిన, తినకూడని ఫుడ్స్ ఇవే, నిపుణుల టిప్స్
Healthy Foods : ఆహారంలో భాగంగా మంచి ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుందని చెప్తున్నారు. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది?

Healthy Diet Tips : శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే ఫుడ్ విషయంలో కొన్ని తప్పులు చేయొద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే మంచి ఫుడ్ శరీరానికే కాదు.. మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాజిటివ్‌గా ఉండేలా చేస్తుందని చెప్తున్నారు. ఆహారం ప్రాముఖ్యతను చెప్తూ ఎన్నో స్పెషల్ డేలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఫుడ్ విషయంలో కామన్‌గా చేసే తప్పులు ఏంటి? ఎలాంటి ఫుడ్‌కి దూరంగా ఉండాలి? ఎలాంటి ఆహారం ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూసేద్దాం.
అనారోగ్యానికి ప్రధానమైన కారణాల్లో ఆహారం కూడా ఒకటి. అందుకే ఆహారం విషయంలో అస్సలు రాజీపడకూడదు. కానీ తెలిసో, తెలియకో ఫుడ్ విషయంలో చేసే కొన్ని తప్పులు మాత్రం ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే ఆహారపు అలవాట్లు కొన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ఆ ఫుడ్‌తో లాభాలు కాదు.. అన్ని నష్టాలే..
ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ నోటికి చాలా రుచిగా ఉంటాయి. కానీ వాటిని ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే. శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి.. బరువు పెరిగిపోతారు. మధుమేహం ఉన్నవారికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ పెరగడం, బీపీ, గుండె సమస్యలు ఇలా ఎన్నో ప్రాణాంతక సమస్యలు వస్తాయి.
ఎలాంటి ఆహారం ఆరోగ్యానికి మంచిది?
ఆహారం విషయంలో తినకూడని ఫుడ్స్ తెలుసుకున్నాము. కానీ డైట్లో చేర్చుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి అనే ప్రశ్నకు.. నిపుణులు సలహాలు ఇచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు హెల్తీ కార్బ్స్, ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉండాలి. పోషకాహారం శరీరానికి అందిస్తే మరీ మంచిది. అయితే హెల్తీ కార్బ్స్ కోసం గోధుమ, రాగి, జొన్న, సజ్జలు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ప్రోటీన్ సోర్స్‌గా గుడ్లు, చేపలు, పెరుగు, పనీర్, చికెన్, పప్పులు బెస్ట్ ఆప్షన్. హెల్తీ ఫ్యాట్స్కోసం నట్‌లు, ఆలివ్ ఆయిల్, అవకాడో, వాల్‌నట్లు, సీడ్స్ మంచిది.
ఇవేకాకుండా ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ ఉండాలి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటిని జ్యూస్‌ల రూపంలో కంటే నేరుగా తీసుకుంటే మంచిది. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్రీన్ టీ, నీళ్లు వంటివి హైడ్రేటెడ్‌గా ఉంచుతూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ప్లేట్ ఎలా ఉండాలంటే..
మీరు తినే ఆహారంలో అంటే ఒక ప్లేట్లో 50 శాతం కూరగాయలు లేదా పండ్లు ఉండాలి. ఆహారంలో ప్రోటీన్ ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. నెమ్మదిగా తినాలి. డిన్నర్ త్వరగా ముగించాలి. వీటన్నింటినీ ఫాలో అయితే కడుపు నిండడంతోపాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఫుడ్ ఎప్పుడూ లిమిటెడ్గానే తీసుకోవాలి. అప్పుడే దానిలోని పోషకాలు శరీరానికి అందుతాయని గుర్తించుకోవాలి. కాబట్టి తీసుకునే ఆహారం ఎప్పుడూ బ్యాలెన్స్‌గా ఉండాలి.






















