Okra For Diabetes: పరగడుపున ఈ నీటిని తాగారంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు
జిగటగా ఉండే బెండకాయ బాగా తింటే లెక్కలు వస్తాయని పెద్దలు చెప్తారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే మాత్రం మధుమేహం అదుపులో ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా కనిపించే వ్యాధులలో ఒకటి మధుమేహం. ఇది ఒకసారి వచ్చిందంటే దాని నుంచి బయట పడటం అనేది అసాధ్యం. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల పరిశోధకులు అనేక రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని వెల్లడించారు. అందులోని డయాబెటిస్ తో పోరాడేందుకు బెండకాయ లేదా ఒక్రా అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల బెండకాయలో 35 కేలరీలు, 1.3 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. విటమిన్ బి6, ఫోలేట్ వంటి అవసరమైన విటమిన్లతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
మధుమేహం ఉన్నవారికి ఇది అద్భుతమైన ఆహార ఎంపికగా మారుతుంది. కరిగే ఫైబర్ చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుతుంది. అంతే కాదు ఈ కూరగాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఆహారం నుంచి విడుదలయ్యే చక్కెరని ఆలస్యంగా జీర్ణం చేస్తాయి. మధుమేహం ఉన్నవారిలో ఉండే మరొక సమస్య బరువు పెరగడం. దీన్ని కూడా బెండకాయ అదుపులో ఉంచుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత చాలా సేపు ఆకలిగా అనిపించదు. అతిగా తినడాన్ని నివారిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడానికి బెండకాయ ఒక కొత్త అద్భుతమైన కూరగాయ.
ఇలా తీసుకోవచ్చు
పోషక విలువలు పోకుండా చేసుకునేందుకు సూప్, వంటలలో జోడించుకోవచ్చు. భిండి సబ్జీ, కుర్కురే భిండి వంటి మరిన్ని వంటకాలు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒక ఒక్రా వాటర్ సూపర్ డ్రింక్ గా చెప్తారు. చాలా సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. శాస్త్రీయ అధ్యయనాలు కూడా దీని ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో ప్రజాదరణ పొందుతోంది. గరిష్ట ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉదయం పూట ఖాళీ కడుపుతో బెండకాయ నీటిని తాగడం మంచి పద్ధతి. రోజులోని ఇతర సమయాల్లో కంటే ఉదయాన్నే ఈ నీటిని తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
⦿బెండకాయ తినడం వల్ల మలబద్ధకం, ఇర్రీటబుల్ బోవెల్ సిండ్రోమ్ నివారించడంలో సహాయపడుతుంది. కొలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
⦿ఇందులోని పెక్టిన్ అనే ఎంజైమ్ చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో మెరుగైన పాత్ర పోషిస్తుంది.
⦿బెండకాయ గింజలు యాంటీ స్ట్రెస్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి
⦿రక్తహీనత నుంచి బయటపడేస్తుంది
⦿గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
⦿నిద్రకి అవసరమయ్యే సెరోటోనిన్, మేలాటోనిన్ ని నియంత్రిస్తాయి
ఇది తప్పనిసరి
క్రిమి సంహారకాలు, పురుగు మందులు ఎక్కువగా స్ప్రే చేస్తారు. అందుకే బెండకాయ వండుకునే ముందు శుభ్రంగా కడగటం చాలా అవసరం. లేదంటే వాటి తాలూకూ అవశేషాలు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీ వయస్సుని బట్టి ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి