Pomegranate: యాపిల్ మాత్రమే కాదు, దానిమ్మ తిన్నా డాక్టర్ అవసరమే రాదట - ఎందుకో తెలుసా?
ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు అంటే అందరికీ ముందుగా యాపిల్, అరటిపండు, బొప్పాయి గుర్తుకు వస్తాయి. కానీ దానిమ్మ కూడా యాపిల్ తో సమానంగా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎర్రటి గింజలతో ఉన్న దానిమ్మ పండు చూడగానే నోరూరిపోతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు అంటే ఎక్కువ మంది యాపిల్ గురించి మాట్లాడతారు. కానీ దానితో సమానంగా దానిమ్మ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాట్, స్వీట్ డిష్, ఐస్ క్రీమ్, స్మూతీస్ ఇలా ఏది చేసినా దాని మీద తప్పనిసరిగా గార్నిషింగ్ కోసం వీటిని దానిమ్మ గింజలు ఉపయోగిస్తారు. రోజుకొక మూడు మీడియం సైజు దానిమ్మ పండ్లు తీసుకోవడం వల్ల ధమనుల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటే మీరు కూడా తప్పకుండా దానిమ్మ పండ్లు తినడం అలవాటు చేసుకోండి.
దానిమ్మ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
⦿ దానిమ్మ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పోషకాలతో నిండి ఉంటుంది. తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.
⦿ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వ్యాధులను నిరోధించేందుకు సహాయపడతాయి. వృద్ధాప్యానికి దారితీసే ఫ్రీ రాడికల్స్ నుంచి మనలని రక్షిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. శరీరం నుంచి అదనపు కొవ్వుని తొలగించడంలో సహాయపడుతుంది.
⦿ రక్తాన్ని పలుచన చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరిచి రక్తప్రసరణకి ఎటువంటి హాని కలగకుండా చూస్తుంది.
⦿ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే మలబద్ధకం సమస్య దరిచేరదు.
⦿ హెల్త్ లైన్ డేటా ప్రకారం దానిమ్మలోని గుణాలు ధమనుల్లో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అథెరోస్క్లెరోసిస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. గుండె పోటు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.
⦿ అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు మూడు దానిమ్మ పండ్లు తింటే చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. కార్డియో వాస్కులర్ డిసీజ్ బారిన పడకుండా కాపాడుతుంది.
⦿ రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు దానిమ్మ తింటే చాలా మంచిది. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతుంది.
⦿ దానిమ్మ మాత్రమే కాదు దాని తొక్కలు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు దానిమ్మ తొక్కలు ఎండబెట్టుకుని పొడి చేసుకుని నీళ్ళలో వేసి మరిగించి తాగితే మంచిది.
⦿ దానిమ్మ తొక్కల పొడి వేడి నీళ్ళలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యను అధిగమించవచ్చు.
⦿ దానిమ్మలోనే కాదు తొక్కల్లో కూడా విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 పోషకాలు ఉన్నాయి. అందుకే దానిమ్మ గింజలు తిన్నతర్వాత తొక్కలు పడేయకుండా వాటిని ఎండబెట్టి పొడి చేసుకుని పెట్టుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: జుట్టు రాలిపోతుందా? గోర్లు విరిగిపోతున్నాయా? కారణాలు ఇవే!