Protein Deficiency: జుట్టు రాలిపోతుందా? గోర్లు విరిగిపోతున్నాయా? కారణాలు ఇవే!
శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరంలోని అవయవాల పనితీరుకి ఆటంకం ఏర్పడుతుంది.
అతిగా తింటున్నా కూడా శరీరంలో శక్తి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందా? అందుకు కారణం ఏంటో తెలుసా ప్రోటీన్ లోపం. అవును శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. కండరాల నిర్మించడానికి, చర్మానికి, శరీరానికి శక్తిని అందించేందుకు, శరీర కణజాలాలకు ప్రోటీన్లు చాలా ముఖ్యం. హార్మోన్లని నియంత్రిస్తాయి. ఇవి రోగాల నుంచి రక్షణగా నిలుస్తాయి. ఒక వ్యక్తికి రోజుకి 50 గ్రాముల ప్రోటీన్ అవసరం. 20 రకాల అమైనో ఆమ్లాలతో కలిసి తయారవుతాయి. వీటిలో 9 అమైనో ఆమ్లాలు ఆహారం ద్వారా పొందుతారు. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే అనేక వ్యాధులు ఎదురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు బిలియన్ మంది ప్రజలు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. ప్రోటీన్ సరిపడినంత లేదని చెప్పే కొన్ని లక్షణాలు సంకేతాలు ఇవి.
ఫ్యాటీ లివర్
ఫ్యాటీ లివర్ ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రోటీన్ లోపం ఎందుకు వస్తుందో కూడా స్పష్టమైన కారణం ఉండదు. కొన్ని అధ్యయనాల ప్రకారం లిపోప్రోటీన్లు ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమవుతాయని వెల్లడైంది. ఊబకాయం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీలివర్ సమస్య అధికంగా కనిపిస్తుంది. అందుకు కారణం వాళ్ళు ప్రోటీన్స్ ఉన్న ఆహారం కాకుండా ఇతర పదార్థాల మీద ఎక్కువ దృష్టి పెడతారు.
కండరాల బలహీనత
శరీర కండరాల పెరుగుదల, నిర్మాణానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది క్షీణించినప్పుడు కండరాలు బలహీనంగా మారిపోతాయి. అలా ఉన్నప్పుడు మీ ఆహార అలవాట్లు మార్చుకోవడం చాలా ముఖ్యం.
జుట్టు, గోర్లు సమస్యలు
జుట్టు పల్చబడిపోతుందా? గోళ్ళు పెళుసుగా మారుతున్నాయా? జుట్టు రంగు తగ్గిపోతుందని మీకు అనిపిస్తుందా? అయితే ఇవన్నీ ప్రోటీన్ లోపం వల్ల కనిపించే సమస్యలే. అందుకు తగిన ఆహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఆకలి ఎక్కువ
ఎంత తిన్నా కూడా ఇంకా ఆకలిగానే అనిపిస్తుంది. అలా ఉంటే ప్రోటీన్ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అందుకే ఈ లోపం ఉంటే ఆకలి అధికంగా అనిపిస్తుంది.
ఈ లక్షణాలన్నీ ప్రోటీన్ తీవ్రమైన లోపం వచ్చినప్పుడు కనిపిస్తాయి. దీన్ని అధిగమించాలంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించిన తర్వాత తగిన విధంగా చర్యలు తీసుకోవాలి.
ప్రోటీన్ ఇచ్చే వనరులు
పాలు, పెరుగు, పనీర్, చికెన్, చేపలు, గుడ్లు వంటి వాటిల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే మాంసాహారం తీసుకునే వాళ్ళు ప్రోటీన్ లోపంతో తక్కువగా బాధపడతారు. శాకాహారులు ప్రోటీన్ కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకోవాలి. తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. చిక్కుళ్ళులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. డాక్టర్ల సూచనల మేరకు ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. బాదం పప్పు, వేరుశెనగ, వాల్ నట్స్, చియా సీడ్స్, క్వినోవా, అవిసె గింజలు, సోయా బీన్స్, ఓట్స్, పచ్చి బఠానీల్లో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీసే 'సైలెంట్ కిల్లర్' వ్యాధులు ఇవే!