Nimmakaya Pulihora Recipe : నిమ్మకాయ పులిహెర టెంపుల్ స్టైల్ రెసిపీ.. నవరాత్రుల్లో ఎనిమిదో రోజు నైవేద్యంగా చేసేయండి
Dusshera Recipes : అమ్మవారికి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు నిమ్మకాయ పులిహోరను ప్రసాదంగా పెడతారు. దీనిని టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
Dusshera Special Nimmakaya Pulihora Recipe : దసరా (Dusshera 2024)సందర్భంగా చేసే నవరాత్రుల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాగే ప్రత్యేకతలకు తగ్గట్లు అమ్మవారు కూడా భక్తులకు ఒక్కో రూపంలో రోజూ దర్శనమిస్తూ ఉంటారు. అయితే దేవి నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గా మాత అవతారంలో కనిపిస్తారు. ఆ సమయంలో అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను చేసి నైవేద్యంగా సమర్పిస్తారు కొందరు. అయితే ఈ నిమ్మకాయ పులిహోరను టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - రెండు కప్పులు
నిమ్మరసం - 4 పెద్ద నిమ్మకాయలు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
వేరుశెనగలు - పావు కప్పు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మెంతులు - చిటికెడు
మినపప్పు - ఒకటిన్నర స్పూన్
పచ్చిశనగపప్పు - ఒకటిన్నర స్పూన్
పచ్చిమిర్చి - 4
జీడిపప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - 8
కరివేపాకు - గుప్పెడు
ఉప్పు - చిటికెడు
పసుపు - టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని కడిగి అన్నం వండుకోవాలి. అయితే బియ్యాన్ని కుక్కర్లో పెట్టడం కంటే నేరుగా వండుకుంటేనే పులిహోర బాగా వస్తుంది. కొన్నిసార్లు కుక్కర్లో వండడం వల్ల అన్నం మెత్తగా, దగ్గరగా అయిపోవచ్చు. అన్నం పొడిపొడిలాడుతూ ఉంటే ప్రసాదం తినేందుకు మరింత రుచిగా ఉంటుంది. కాబట్టి అన్నాన్ని నేరుగా గంజి వార్చి వండుకుంటే బాగుంటుంది. ఇలా వండుకున్న అన్న పెద్ద పల్లెంలో వేసి కాసేపు ఆరబెట్టుకోవాలి.
అన్నం తడి ఆరుతున్న సమయంలో ముందుగా గింజలు లేకుండా తీసిపెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని అన్నంలో వేయాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అయితే పులుపు, ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్లు వేసుకుంటే పులిహోరను మీరు బాగా ఆస్వాదించవచ్చు. మీకు నచ్చేలా చేసుకుంటే అమ్మవారు కూడా దానిని ఇష్టంగా స్వీకరిస్తారని భావించాలి. ఉప్పు, నిమ్మరసం బాగా కలిసేలా అన్నాన్ని కలపాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టి తాళింపును సిద్ధం చేసుకోవాలి.
స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో నూనె వేసి.. అది వేడి అయిన తర్వాత దానిలో పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి. అనంతరం మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి రోస్ట్ చేసుకోవాలి. అనంతరం దానిలో ఎండుమిర్చి వేయాలి. దానిలోనే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రేమే. మీ దగ్గర లేకుంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలను తాళింపులో వేయాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే వీటి సంఖ్యను పెంచుకోవచ్చు. కరివేపాకు కూడా వేసి అవి వేగిన తర్వాత కాస్త ఉప్పు వేయాలి. చివరిగా పసుపు, ఇంగువ వేసి కలిపి స్టౌవ్ ఆపేయాలి. తాళింపు బాగా కలిసిన తర్వాత.. ముందుగా నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేయాలి. దానిలోనే వేయించుకున్న పల్లీలు కూడా వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ. దీనిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. లేదంటే లంచ్ రెసిపీలుగా కూడా దీనిని చేసుకోవచ్చు.
Also Read : దసరా సమయంలో అమ్మవారికి చిట్టిగారెలు ఎందుకు పెడతారో తెలుసా? ఇలా చేసి నైవేద్యంగా సమర్పిస్తే