Chitti Garelu for Ammavaru : దసరా సమయంలో అమ్మవారికి చిట్టిగారెలు ఎందుకు పెడతారో తెలుసా? ఇలా చేసి నైవేద్యంగా సమర్పిస్తే
Dusshera Recipes : దసరాకి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు వండి పెడతారు. వాటిలో చిట్టిగారెలు ఒకటి. మరి వీటిని ఎలా తయారు చేస్తారో.. అమ్మవారికి ఎందుకు పెడతారో తెలుసా?
Dusshera Special Chitti Garelu Recipe : దసరా సమయంలో అమ్మవారికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా పెడతారు. అయితే వీటిలో చిట్టిగారెలకు స్పెషల్ ప్లేస్ ఉంది. అయితే ఇవి కేవలం అమ్మవారికి ఇష్టమైనవే కాదు.. దీనివెనుక ఓ చిట్టి స్టోరి కూడా ఉంది. అమ్మవారు తొమ్మిదిరోజులు మహిషాసురిడితో యుద్ధం చేస్తారు. ఆ సమయంలో అలసట రాకుండా చిట్టిగారెలను అమ్మవారికి పెడతారు. వాటినే మాషచక్రములు అని పిలిచేవారు. వీటిని అమ్మవారికి ఇష్టమైన మినుములతో చేసి నైవేద్యేంగా సమర్పిస్తారు. మరి ఈ చిట్టి చిట్టి గారెలను అమ్మవారికి ఎలా చేయాలో? వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో? ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మినపప్పు - రెండు కప్పులు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
ఉప్పు - రుచికి తగినంత
బేకింగ్ సోడా - పావు టీస్పూన్
నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత
తయారీ విధానం
ముందుగా మినపప్పును బాగా కడిగి నానబెట్టుకోవాలి. దీనిని రాత్రి నానబెట్టుకుంటే ఉదయాన్నే ప్రసాదంగా చేసుకోవడం ఈజీ అవుతుంది. స్నాక్స్‌గా చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవాలనుకునే టైమ్‌కి నాలుగు గంటలు ముందు నానబెట్టినా సరిపోతుంది. అయితే నానిన మినపప్పును మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దానిలో నీరు వేయకుండా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొన్ని చుక్కలు నీళ్లు చల్లి పిండిని గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసుకుని వాటిని పిండిలో వేయాలి. దానిలోనే రుచికి తగినంత ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. పిండిని బాగా కలిపిన తర్వాత స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. దానిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి.. కాగనివ్వాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్దను దానిలో వేయాలి. పిండి పైకి వస్తే నూనె వేసేందుకు సిద్ధంగా ఉందని అర్థం. పిండి పైకి రాకుండా గారెలు వేస్తే పిండి అడుగున అంటుకుపోతుంది.
Also Read : బతుకమ్మకు ఏ రోజు ఏ నైవేద్యం పెడతారో తెలుసా? రెసిపీలు ఇవే
ఇప్పుడు నిమ్మకాయంతా పిండి ముద్దను తీసుకుని గారెలుగా ఒత్తుకుని నూనెలో వేయాలి. ఈ గారెలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గారెలను తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన బ్యాటర్‌తో కూడా ఇలానే చేయాలి. అంతే టేస్టీ టేస్టీ చిట్టిగారెలు రెడీ. అమ్మవారికి దసరా సందర్భంగా నైవేద్యం పెట్టాలన్నా.. టేస్టీ ఈవెనింగ్ స్నాక్‌గా అయినా.. క్రంచీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా దీనిని తీసుకోవచ్చు.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ చిట్టిగారెలను దసరా సమయంలో భక్తులు నైవేద్యంగా పెడతారు. వీటితో అమ్మవారు ప్రసన్నమవుతారని చెప్తారు. పైగా వీటిని ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పండుగ సమయంలో వీటిని చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. లేదంటే మీరు వీటిని రెగ్యూలర్గా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి పెట్టేయండి.
Also Read : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే