Kadamba Prasadm Recipe : అమ్మవారికి నాలుగోరోజు పెట్టాల్సిన ప్రసాదం ఇదే.. విజయ దశమి స్పెషల్ కదంబ ప్రసాదం రెసిపీ
Vijayadashami Special Recipes : దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగోరోజు పెట్టే ప్రసాదమే కదంబ ప్రసాదం. దీనిని టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
Dussehra 2024 Day 4 Special Kadambam Prasadam Recipe నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడతారు. నాలుగోరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆరోజు అమ్మవారికి వివిధ కూరగాయలతో చేసే కదంబ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. ఈ సీజన్లో దొరికే అన్ని కూరగాయలను దీనిలో వేసి తయారు చేసే ఈ వంటకం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. మరి ఈ టేస్టీ కదబం ప్రసదాన్ని దసరా సమయంలో అమ్మవారు మెచ్చేలా ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - కప్పు
కందిపప్పు - అరకప్పు
పెసరపప్పు - అరకప్పు
పసుపు - పావు టీస్పూన్
నీళ్లు - నాలుగు కప్పులు
వంకాయలు - 2
మునక్కాయ - 1
చిన్న దోస కాయ - సగం
గుమ్మడి కాయ - 5 ముక్కలు
చిక్కుళ్లు - 5
సొరకాయ - 5 ముక్కలు
చిలగడ దుంప - చిన్నది
ముల్లంగి - చిన్నది
బఠాణీ - గుప్పెడు
కరివేపాకు - రెండు రెబ్బలు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
చింతపండు - నిమ్మకాయ సైజ్
సాంబార్ పొడి - 2 టేబుల్ స్పూన్లు
బెల్లం - 2 టేబుల్ స్పూన్లు
తాళింపు కోసం
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఎండు మిర్చి - రెండు
ఆవాలు - పావు టీస్పూన్
కరివేపాకు - రెండు రెబ్బలు
ఇంగువ - రెండు చిటికెళ్లు
తయారీ విధానం
ప్రసాదం చేసే గంట ముందు కందిపప్పు, పెసరపప్పును విడిగా నానబెట్టుకోవాలి. ఈలోపు కదంబం ప్రసాదానికి కావాల్సిన కూరగాయలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దానిలో బియ్యం, నానబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పును నీళ్లు లేకుండా వేసుకోవాలి. బియ్యం కప్పు తీసుకుంటే మిగిలిన పప్పు అరకప్పు తీసుకోవాలి. దీనికి కొలతగా నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి. దానిలో కాస్త ఉప్పు, పసుపు వేసి మూతపెట్టుకుని స్టౌవ్ వెలిగించి దానిపై ఉంచాలి. రెండు లేదా మూడు.. మీరు ఎంచుకున్న బియ్యం బట్టి విజిల్స్ రానివ్వాలి.
ఈ ప్రాసెస్ జరుగుతుండగానే.. మరోస్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. దానిలో నీళ్లు వేసి.. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, మునక్కాయలు, దోసకాయ ముక్కలు, స్వీట్ గుమ్మడికాయ ముక్కలు, చిక్కుళ్లు వేసుకోవాలి. గోరు చిక్కుళ్లు వేసుకున్నా పర్లేదు. సొరకాయ ముక్కలు, చిలగడదుంప ముక్కలు, ముల్లంగి ముక్కలు, పచ్చి బఠాణీ, కరివేపాకు వేయాలి. పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి.. వాటిని ఉడకనివ్వాలి. స్టౌవ్ మంటను మీడియంలో ఉంచి పది నిమిషాలు ఆగాలి.
కూరగాయలు దాదాపు ఉడికిపోతాయి. అప్పుడు దానిలో కారం, ముందుగా నానబెట్టుకున్న చింతపండుగుజ్జు, సాంబార్ పొడిని వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూరగాయలు బాగా ఉడికిన తర్వాత.. ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని దీనిలో వేయాలి. అనంతరం వాటిలోని రుచిని బ్యాలెన్స్ చేసేందుకు బెల్లం తురుము కూడా వేసి కలిపి.. రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకోవాలి. దానిలో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాళింపు వేసుకోవాలి. దీనిని రైస్‌లో కలిపేయాలి. అంతే కదంబ ప్రసాదం రెడీ.
చాలామంది ఇది బిసిబిల్లాబాత్ టైప్ అనుకుంటారు కానీ.. ప్రసాదంగా చేసే వాటిలో వెల్లుల్లి, ఉల్లిపాయ వాడరు. చూసేందుకు ఒకేలా ఉన్నా.. దీనిని తయారీ విధానం వేరుగానే ఉంటుంది. దీనిని కేవలం ప్రసాదాల కోసమే కాకుండా.. లంచ్ బాక్స్‌గా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందు ఆలస్యం.. ఈ దసరా సమయంలో అమ్మవారికి ఈ కదంబం ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టేయండి.
Also Read : అన్నపూర్ణ దేవికి అల్లం గారెలు.. నవరాత్రుల్లో మూడోవ రోజు చేయాల్సిన నైవేద్యం ఇదే