Sweating: మీ చెమట దుర్వాసన వస్తుందా? అయితే వీటిని తినడం తగ్గించండి
చెమట పట్టడం సహజం, కానీ కొందరిలో చాలా దుర్వాసన వస్తుంది.
శారీరక శ్రమ చేసినా, వాతావరణం వేడిగా ఉన్నా...శరీరం పై చెమట పట్టడం సహజం. ఇలా చెమట పట్టడం అనేది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే కొందరిలో ఆ చెమట విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇది చుట్టుపక్కల వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా చెమట దుర్వాసన వచ్చే వారికి అందరూ దూరమైపోతూ ఉంటారు. అందుకే చెమట దుర్వాసన వేయకుండా కొన్ని రకాల ఆహారాలను దూరంగా పెట్టాలి.
కొందరి శరీరాల నుంచి వచ్చే చెమట విపరీతంగా దుర్వాసన వేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇందుకు వారి జన్యువులు, శరీరంలోని బ్యాక్టీరియా కారణం కావచ్చు. అలాగే వారసత్వంగా కూడా కొందరికి చెమట విపరీతంగా దుర్వాసన వస్తుంది. అలాగే మనం తినే ఆహారం కూడా ఈ దుర్వాసనను పెంచుతుంది. శాఖాహారులతో పోలిస్తే మాంసాహారం తినే వ్యక్తుల నుంచి వచ్చే చెమట విపరీతంగా దుర్వాసన వస్తుంది. అలాగే వెల్లుల్లిని, ఉల్లిపాయల్ని అధికంగా తినేవారిలో కూడా ఈ చెమట కంపు అధికంగా ఉంటుంది. మసాలా వేసిన ఆహారాన్ని అధికంగా తిన్నా కూడా చెమట వాసన రావడం ఖాయం.
ఎవరైతే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారో వారి నుంచి దుర్వాసన ఎక్కువగా రాదు. కొవ్వు ఉన్న ఆహారాలు, మాంసం, గుడ్డు లాంటివి తినేవారిలో మాత్రం విపరీతంగా చెమట దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమస్యతో బాధపడుతున్న వారయితే ముందుగా మీ ఆహారాన్ని మార్చుకోండి. ఉల్లిపాయలను తగ్గించండి. మాంసం వంటివి తినడం తగ్గించండి. తాజా పండ్లు, తాజా కూరగాయలతో వండిన ఆహారాలను తినేందుకు ప్రయత్నించండి. అయితే ఒకేసారి డైట్‌ను మార్చడం కూడా మంచిది కాదు. మెల్లగా డైట్‌ను చేంజ్ చేసుకోండి. చెమట వాసన రాకుండా అడ్డుకోవడం కోసం విపరీతంగా డియోడరెంట్ వాడేవాళ్లు ఉన్నారు. ఇలా చేయడం వల్ల శరీరం మరిన్ని సమస్యల బారిన పడవచ్చు. అలాగే చర్మ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సాత్విక ఆహారానికి అలవాటు పడితే చెమట నుంచి వచ్చే దుర్వాసనను అడ్డుకోవచ్చు.
చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని నీరు కూడా బయటికి పోతుంది. అందుకే శరీరంలో నీటి శాతం తగ్గకుండా నీరు తాగుతూ ఉండాలి. శరీర బరువుకు తగ్గ నీటిని తీసుకుంటూ ఉండాలి. చెమట వాసన రాకుండా ఉండాలంటే పాలకూర, కాలీ ఫ్లవర్, పుచ్చకాయ, ద్రాక్ష వంటివి తింటూ ఉండాలి. ఇవి చెమట దుర్వాసన రాకుండా అడ్డుకుంటాయి. పచ్చిమిర్చి తక్కువగా తింటూ ఉండాలి. పచ్చిమిర్చి తినడం వల్ల కూడా శరీరం నుంచి చెమట దుర్వాసన వస్తుంది. కాఫీని తాగడం కూడా తగ్గించాలి. రోజుకోసారి కన్నా ఎక్కువ తాగకపోవడమే మంచిది.
Also read: మగవారు వాసెక్టమీ చేయించుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందా?
Also read: ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైనదిగా అధికారికంగా గుర్తింపు తెచ్చుకున్న ఆకుకూర ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.