Asthma: ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేస్తే ఆ సమస్య ఎక్కువవుతుందా?
ఆస్తమా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు అది ట్రిగ్గర్ అవుతుందో చెప్పడం కష్టం.
Asthma: ఆస్తమా చెప్పుకునేందుకు చిన్న సమస్య అయినా దానితో బాధపడే వారికి తెలుస్తుంది... ఆస్తమాను భరించడం ఎంత కష్టమో. కొన్ని రకాల పరిస్థితుల వల్ల ఆస్తమా పెరిగే అవకాశం ఉంది. కాలుష్యం, దుమ్మూ ధూళి అనేవి ముఖ్యమైన ట్రిగ్గర్లు. అలాగే వ్యాయామం కూడా ఆస్తమాను పెంచే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
వ్యాయామం చేసినప్పుడు తీవ్రంగా అలసిపోతాం. అలాంటప్పుడు ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఆయాసం వస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది మరి కొంచెం కష్టంగా ఉంటుంది. దగ్గు, ఛాతీ బిగుతుగా పట్టడం వంటి ఇబ్బందులు వస్తాయి. ఆస్తమా రోగులలో వ్యాయామం చేసే సమయంలో ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలు కుచించికుపోతాయి. ఒక గంట వరకు ఇబ్బంది పెట్టి తర్వాత సాధారణ స్థితికి వస్తాయి. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యాయామం చేయడానికి బయటికి వెళ్లడం మానుకోండి. చల్లని పొడి గాలిలో వ్యాయామం చేయడం వల్ల ఆస్తమా లక్షణాలు పెరుగుతాయి. మీకు అలెర్జీ ఉన్నట్లయితే కలుషితమైన గాలి, మొక్కలు, పువ్వులు ఉన్నచోట వ్యాయామం చేయవద్దు. అలాగే ఎక్సర్‌సైజులు చేస్తున్నప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోండి. మాస్క్ ధరించండి.
వ్యాయామానికి వెళుతున్నప్పుడు ఇన్‌హేలర్ ఎప్పుడూ దగ్గరలోనే ఉంచుకోండి. 10 నుంచి 20 నిమిషాలకు మించి వ్యాయామం చేయొద్దు. కఠినమైన వ్యాయామాలు చేయడం మానండి. నడక, జాగింగ్ వంటి సాధారణ వ్యాయామాలతోనే సరిపెట్టండి.
ఆస్తమా రోగులు కొన్ని రకాల ప్రత్యేకమైన ఆహారాన్ని తినాలి. క్యారెట్స్, ఆకుకూరలు, చిలగడదుంపలు వంటివి అధికంగా తినాలి. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఉబ్బసాన్ని తగ్గిస్తాయి. అలాగే విటమిన్ అధికంగా ఉండే ఆహారాలను కూడా తినాలి. ముఖ్యంగా గుడ్లు, పాలు, సాల్మన్ వంటివి తినాలి. పండ్లలో యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అరటిపండ్లలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వాటిని ఆస్తమా బాధితులు తింటే ఎంతో మేలు జరుగుతుంది.
వీటికి దూరంగా...
ఇక తినకూడని ఆహార జాబితాలు కూడా ఉన్నాయి. పొట్టలో గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలను తినకూడదు. క్యాబేజీ, ఉల్లిపాయలు, కూల్ డ్రింకులు, వెల్లుల్లి, మసాలా పదార్థాలను తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా తినకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడున్నర కోట్ల మంది ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇక మనదేశంలోనే కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
Also read: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.