Legs Health: తరచూ కాలు జారినట్టు అనిపిస్తోందా? ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి
కాలు జారడం అనేది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతంగా భావించాలి
Legs Health: కొంతమంది నడుస్తూ కాలు జారి పడిపోతుంటారు. మరికొందరు కాలు జారుతుండగానే తట్టుకొని నిలబడతారు. కానీ ఇలా పదేపదే కాలు జారడం అకారణంగా మంచి లక్షణం కాదు. అడుగు వేసేటప్పుడు పాదం ముందు భాగాన్ని మొదటగా నేలకి ఆనిస్తాము. అలా ఆనించనప్పుడు అది జారితే దాన్ని డ్రాప్ ఫుట్ అంటారు. ఇలా నేలపై పదే పదే జారడం అనేది అనారోగ్య కారకంగా చెప్పుకోవాలి. కొన్ని శరీర నిర్మాణ సంబంధమైన సమస్యలు ఉన్నాయేమో గమనించాలి.
నరాలు దెబ్బతిన్నా, కండరాల బలహీనత ఉన్నా, పెరిఫెరల్ వంటి నరాల సమస్యలు ఉన్నా కూడా ఇలా కాలు జారుతూ ఉంటుంది. కాలు పట్టు లేకపోవడం, వెన్నుపాముకు సమస్యలు వచ్చినా, వెన్ను దెబ్బ తిన్నా కూడా ఇలా కాలు పట్టుకు దొరక్కుండా జారిపోతూ ఉంటుంది. దీన్ని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. సరిగా నడపడం రాదా అని కామెంట్ చేస్తారు... కానీ కాలు జారుతున్న వ్యక్తికే ఆ విషయం తెలుస్తుంది, కాలు తన అదుపులో లేదని. కాబట్టి ఇలా పదేపదే కాలు జారుతూ ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఒకసారి వైద్యులను కలిసి చెక్ చేయించుకుంటే చాలా ఉత్తమం.
డయాబెటిస్ సమస్య ఉన్నవారు కూడా ఇలా కాలుజారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోజూ వ్యాయామం చేస్తూ, మంచి ఆహారాన్ని తింటూ, ఎత్తుకు తగ్గ బరువును నిర్వహిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే ఇలా కాలు జారడం తగ్గుతుంది. అలాగే పెరిఫెరల్ వంటి నరాల సమస్యలు లేకుండా ఉన్నాయో లేవో కూడా నిర్ధారించుకోవాలి. ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం వల్ల కాళ్లలోని కండరాలు బిగుసుకుపోయి, కాలుజారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చుంటే, కాళ్ళ కండరాలపై ఒత్తిడి అధికంగా పడుతుంది. ఇది కూడా కాలు జారడానికి దారితీస్తుంది.
మనం వేసుకునే చెప్పులు కూడా ఒక్కోసారి కాలు జారడానికి కారణం అవుతాయి. అవి నేలపై నిలవకుండా జారేవి అయితే మనం కిందపడి గాయాల పాలవుతాం. కాబట్టి చెప్పులు జారుడుగా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుని వాడండి. అలాగే తరచూ కాలుజారుతూ ఉంటే... కాలు, పాదం కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలను చేస్తూ ఉండండి. జాగింగ్, నడకా వంటివి చేయండి. అలాగే స్ట్రెచింగ్ వంటివి కూడా చేస్తే కాలు, పాదాల కండరాలు బలంగా మారుతాయి.
తాజా ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. కాలి కండరాలకు బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తింటే ఎంతో మంచిది. ముఖ్యంగా బరువును మాత్రం అదుపులో ఉంచుకోండి. శరీరం బరువు పెరిగితే... కాలు ఆ బరువును మోయలేక త్వరగా నీరసపడుతుంది. క్షీణిస్తుంది. కానీ కండరాలు నీరసపడితే ఎక్కువ దూరం నడవలేరు. రెండు అడుగులు వేస్తేనే అలసిపోతారు. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేకుంటే కీళ్లు అరిగిపోయి పాదాలపై బరువుపడి నొప్పులు వస్తాయి.
Also read: ఆ పరీక్షతో గుండెపోటు వచ్చే అవకాశాన్ని ముందే తెలుసుకోవచ్చా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.