విటమిన్ మాత్రలు సమర్థంగా పనిచేయాలంటే ఎప్పుడు, ఎలా వేసుకోవాలో తెలుసా?
మన శరీరానికి అవసరమైన విటమిన్ మాత్రలు వేసుకుంటూ ఉంటాం. కానీ వాటిని వేసుకునే పద్ధతి మాత్రం చాలా మందికి తెలియదు.
మన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, లవణాల వంటి పోషకాలను ఆహారం ద్వారానే అందేలా చూసుకోవాలి. కానీ కొందరిలో పోషకాహార లోపం తలెత్తుతుంది. అలాంటప్పుడు వైద్యులు వారికి విటమిన్ టాబ్లెట్లను సూచిస్తారు. ఎంతోమందికి ఆ విటమిన్ టాబ్లెట్లను ఏ సమయంలో ఎలా వేసుకోవాలి అన్నది అవగాహన లేదు. ఆ విటమిన్లు శరీరానికి తగినంత శక్తిని అందించాలంటే వాటిని వేసుకునే పద్ధతి కూడా సరైనదై ఉండాలి. కొన్ని రకాల విటమిన్ టాబ్లెట్లను వేసుకోవడానికి కొన్ని నిర్దిష్ట సమయాలు ఉంటాయి. కానీ వీటిని పాటించే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఏ విటమిన్ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.
విటమిన్ టాబ్లెట్లలో నీటిలో కరిగేవి ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3... వంటి బి విటమిన్ మాత్రలు కూడా నీటిలో కరిగే విటమిన్లు. వీటిలో విటమిన్ బి 12 శరీరం బాగా గ్రహించాలంటే ఆహారం తిన్న వెంటనే వేసుకోవాలి. అదే విటమిన్ సి కూడా వేసుకుంటున్న వారు విటమిన్ బి12 వేసుకున్నాక రెండు గంటల గ్యాప్ ఇచ్చి విటమిన్ సి మాత్ర వేసుకోవాలి. లేకపోతే విటమిన్ బి12ను శరీరం వినియోగించుకోకుండా విటమిన్ సి అడ్డుకునే అవకాశం ఉంది. ఇక మిగతావన్నీ ఆహారం తిన్న వెంటనే వేసుకున్నా మంచిదే.
విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె ఇవన్నీ కూడా కొవ్వులో కరిగే విటమిన్లు. మనం ఆహారం ద్వారా తీసుకునే కొవ్వులో ఇవి కలిసి శరీరం శోషించుకునేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటి విటమిన్లను కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలు తిన్న వెంటనే వేసుకుంటే మంచిది. అలా అని మాంసం వంటివి తినమని చెప్పడం లేదు. బాదం, జీడిపప్పు వంటివి తిని ఆ వెంటనే ఈ విటమిన్లను వేసుకుంటే ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి.
విటమిన్ ఏ మనకి అత్యవసరమైన పోషకం. అయితే దీన్ని ఆహారం ద్వారా తీసుకుంటే మంచిదే. కానీ విటమిన్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు రోజులో ఎక్కువ డోసులో విటమిన్ ఏను తీసుకోకూడదు. అలా తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు రావచ్చు. అలాగే పొగతాగే అలవాటు ఉన్నవారు, ఒకప్పుడు పొగ తాగి మానేసిన వారు కూడా విటమిన్ ఏను అధిక మొత్తంలో తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఐరన్ టాబ్లెట్లను ఎక్కువ మందికి సూచిస్తారు వైద్యులు. ఐరన్ టాబ్లెట్లను శరీరం బాగా శోషించుకోవాలంటే పరగడుపున వేసుకోవాలి. అంటే పొట్టలో ఏమీ లేనప్పుడే ఈ ఐరన్ మాత్రం తీసుకుంటే శరీరం శోషించుకుంటుంది. అలాగే విటమిన్ సి నిండిన బత్తాయి, నారింజ, నిమ్మ వంటి రసాలతో ఐరన్ టాబ్లెట్ ను వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఐరన్, విటమిన్ సి రెండింటిని శరీరం సమర్థవంతంగా గ్రహిస్తుంది. కానీ క్యాల్షియం నిండిన పదార్థాలు తిన్నప్పుడు మాత్రం ఐరన్ టాబ్లెట్లను వేసుకోకూడదు. ఎందుకంటే క్యాల్షియం శరీరం ఐరన్ శోషించుకోకుండా అడ్డుకుంటుంది. అంటే ఐరన్ టాబ్లెట్ వేసుకున్నాక ఒక గంట పాటు పాలు తాగకూడదు. అలాగే పాలు లేదా పెరుగు తిన్నాక ఒక గంట పాటు ఐరన్ టాబ్లెట్లను వేసుకోకూడదు.
Also read: తలలో పేలు వేధిస్తున్నాయా? ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి
Also read: తిన్నది అరగకపోవడం చిన్న సమస్య కాదు, క్యాన్సర్ సంకేతం కావచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.