Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?
గోరింటాకు కేవలం అందమే కాదు, ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఒకప్పుడు గోరింటాకు అంటే మొక్క నుండి తెంపి ఇంట్లోనే రుబ్బి చేతులకు పెట్టుకునేవారు. అది రుబ్బుతున్నప్పుడే చెయ్యి పండిపోయేది. ఇప్పుడు మెహందీ అని బయట లభిస్తుంది. కానీ దానిలో ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఎరుపుగా పండేందుకు ఈ రసాయనాలను కలుపుతారు. కాబట్టి గోరింటాకు, మెహందీలలో గోరింటాకును ఎంచుకోవడమే మంచిది. ఆకులను రుబ్బి చేతకు పెట్టుకునే గోరింటాకు వల్ల మహిళలకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
గోరింటాకు అందరికీ ఒకేలా పండాలని లేదు, వారి శరీర తత్వాన్ని బట్టి దాని రంగు మారుతుంది. శరీరంలో ఎవరికైతే అధిక వేడి ఉంటుందో, వారికి గోరింట ఎర్రగా పండుతుంది. గోరింటాకు తరచూ పెట్టుకునే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సమస్య తగ్గుతుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి మహిళలు గోరింటాకు తరచూ పెట్టుకుంటే అవి హార్మోన్లు చక్కగా పనిచేస్తాయని చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు కూడా గోరింటాకు చెక్ పెడుతుందని వివరిస్తున్నారు పరిశోధనకర్తలు. అయితే వేసవికాలంలోనే గోరింటాకును అధికంగా పెట్టుకోవాలని వివరిస్తున్నారు. వాతావరణం చల్లగా అయ్యాక గోరింటాకు పెట్టడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఇంటి దగ్గర పెట్టుకునే గోరింటాకు మాత్రం అన్ని కాలాలలోనూ మేలే చేస్తుంది.
చాలామందికి గోరింటాకు ఎర్రగా పండాలని కోరిక. అలాంటివారు గోరింటాకు చేతికి పెట్టుకొని తీసేసాక నీటితో కడగవద్దు. కొబ్బరి నూనెతో మర్దన చేసుకోండి. కాసేపు అలా వదిలేయండి. దీనివల్ల గోరింటాకు రంగు ముదురు రంగులోకి మారుతుంది. అలాగే గోరింటాకు రుబ్బుతున్నప్పుడు కాస్త నిమ్మ రసాన్ని కూడా జోడిస్తే మంచిది. గోరింటాకు పెట్టుకునే ముందు చేతులను మొదట శుభ్రంగా కడుక్కోవాలి. అలాగని సబ్బుతో కడగవద్దు. సాధారణ నీటితో కడుక్కుంటే సరిపోతుంది. గోరింటాకు బాగా పండాలంటే పూర్వం లవంగం కాల్చి ఆ పొగను చేతులకు ఆవిరి పట్టేవారు. ఇలా చేయడం వల్ల గోరింట మరింత ఎర్రగా పండుతుందని నమ్మేవారు. చిన్నపిల్లలకు గోరింటాకును పెట్టడం మంచిది. రసాయనాలు కలిపిన మెహెందీ మాత్రం పెట్టకూడదు. మెహెందీ పెట్టిన చేతులతో పిల్లలు అన్నం తినకూడదు. అందులో ఉండే రసాయనాలు పొరలు పొరలుగా ఊడిపోతాయి. అవి పొట్టలోకి చేరే అవకాశం ఉంది. అందుకే ఆకులతో రుబ్బిన గోరింటాకునే వాడాలి.
Also read: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?
Also read: ఒక్కసారి పైనాపిల్ హల్వా తింటే మీకు ఇంకే హల్వా నచ్చదు, రెసిపి ఇదిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.