Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?
తన భర్త మాజీ లవర్‌ని మర్చిపోలేకపోతున్నాడని చెబుతున్న ఒక భార్య కథ ఇది.
ప్రశ్న: మాకు పెళ్లయి 15 ఏళ్లు దాటింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. నా భర్త పెళ్లి సమయంలోనే తాను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. తనది చాలా సీరియస్ ప్రేమ అని చెప్పాడు. కానీ అది పెళ్లి వరకు రాలేదని చెప్పాడు. నేను అది తెలుసాక కూడా పెళ్లికి ఒప్పుకున్నాను. 15 ఏళ్లలో ఎప్పుడూ సమస్య రాలేదు. ఈమధ్య అతనిలో చాలా మార్పు వచ్చింది. ఫోన్లో ఎవరితోనో ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు. నాకు సందేహం వచ్చి అతను లేనప్పుడు వాట్సప్ చాట్, ఫోన్ కాల్స్ చూసాను. ఆయన మళ్ళీ తన మాజీ లవర్ తో కనెక్ట్ అయినట్టు తెలిసింది. అప్పటినుంచి నాకు భయంగా ఉంది. వాళ్ళు మళ్ళీ సన్నిహితంగా ఉండడం నాకు నచ్చడం లేదు. ప్రతిరోజు గంటలు గంటలు మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇద్దరూ వేరే వేరే ఊరిలో ఉన్నప్పటికీ వారు మానసికంగా చాలా దగ్గరగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. భవిష్యత్తులో వారు మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నట్టు వాట్సప్ చాట్ ద్వారా నాకు అర్థమవుతోంది. నేను ఇదే విషయాన్ని నా భర్తను నిలదీశాను. ఆయన మాత్రం కేవలం ఫ్రెండ్షిప్ అని చెబుతున్నాడు. ఫ్రెండ్షిప్‌లో లవ్ స్టిక్కర్లు ఎందుకు పంపించుకుంటున్నారని కూడా అడిగాను. సమాధానం ఇవ్వడం లేదు. నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. పిల్లలు మా ఇద్దరం తరచూ గొడవ పడుతుంటే కంగారు పడుతున్నారు. నా భర్తను ఎలా మార్చుకోవాలో దయచేసి చెప్పండి.
జవాబు: పదిహేనేళ్ల కిందటి ప్రేమ ఇప్పుడు టచ్‌లోకి వచ్చేసరికి అతను మరింత ఎక్సైటింగ్ గా ఫీల్ అయి ఉండవచ్చు. దానివల్ల ఆమెతో ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఆమె ఏం చేస్తోంది, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఆమె వ్యక్తిగత జీవితం ఎలాగుంది వంటి వాటి గురించి తెలుసుకునేందుకు ఆయన ఆతృత చూపిస్తున్నాడని నాకు అర్థం అవుతోంది. వాట్సాప్ చాట్‌లో కేవలం స్నేహంగానే ఉంటే మీరు పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ అంతకుమించి మెసేజ్లు ఉంటే మాత్రం మీరు దృఢంగా ఉండాలి. మీ భర్తతో పెద్దల సమక్షంలోనే మాట్లాడాలి. మీ అత్త మామ సాయాన్ని తీసుకోవాలి. ఈ విషయాన్ని చెప్పి మీ భర్త ఆమెతో మాట్లాడనివ్వకుండా మీరు కట్టడి చేయాలి. అలాగే ఆమెతో కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆమె వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో వివరించండి. వీలైతే ఆమె భర్తతో కూడా మాట్లాడండి. ఆమె భర్తకు తెలిస్తే ఖచ్చితంగా ఆమె కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు మీ భర్తతో ప్రేమగా ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. పిల్లలు ఎంతగా తల్లడిల్లిపోతున్నారో మీ భర్తకు తెలిసేలా చేయండి. ముందుగా మీరు ఆమెతో గొడవ పడకుండా మెల్లగా మాట్లాడండి. ఈ విషయంలో మీకు మీ అత్తమామలు సహకరించే అవకాశం ఉంది. మీ పుట్టింటి వారి సాయాన్ని కోరితే మీ భర్త హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ అత్తమామల సాయంతోనే మీరు దీన్ని పరిష్కరించండి. అలాగే మీ భర్త మాజీ లవర్‌కు ఆమె భర్తతో కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ బంధం హద్దులు దాటకుండా ఉంటుంది.