Diarrhea: దేశవ్యాప్తంగా పెరుగుతున్న డయేరియా కేసులు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, నివారణ చర్యలు ఇవే
Diarrhea: దేశవ్యాప్తంగా డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే వారిలో 90 శాతం మందికి డయేరియా లక్షణాలే ఉంటున్నాయి. డయేరియా అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Diarrhea: వర్షాకాలం మొదలైంది. అంటు వ్యాధులు షురూ అయ్యాయి. ఈ కాలంలో పలుకరించే మలేరియా, డెంగ్యూ వ్యాధులతో పాటు డయేరియా కూడా ప్రజలను వణికిస్తుంది. అయితే తాజాగా దేశవ్యాప్తంగా డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే వారిలో 90 శాతం మంది డయేరియా లక్షణాలతో అడ్మిట్ అవుతున్నారు. జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో పిల్లలు, పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. కడుపునొప్పి వాంతులు వచ్చిన రెండు రోజుల్లో విరేచనాలు మొదలవుతున్నాయి. వాంతులు, కడుపు నొప్పి కారణంగా నీరసించిపోతున్నారు. అసలు డయేరియా అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
డయేరియా అంటే ఏమిటి?
డయేరియా సోకితే విరేచనాలు అవుతాయి. ఇది చాలా సాధారణ పరిస్థితి. అయినప్పటికీ కొన్ని సందర్బాల్లో వికారం, వాంతులు, కడుపునొప్పి లేదా బరువు తగ్గడం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి. అతిసారం సాధారణంగా స్వల్పకాలంలో తగ్గిపోతుంది. అయినప్పటికీ కొన్ని రోజులు లేదా వారాల పాటు అలాగే ఉన్నట్లయితే మరో సమస్య ఉందని గుర్తించాలి. డయారియా కడుపులో ఇన్ఫెక్షన్, పేగు వ్యాధులకు సంకేతం.
డయేరియా లక్షణాలు:
⦿ కడుపు తిమ్మిరి లేదా నొప్పి.
⦿ ఉబ్బరం.
⦿ వికారం.
⦿ వాంతులు.
⦿ జ్వరం.
⦿ మలంలో రక్తం.
⦿ మలంలో శ్లేష్మం.
⦿ లూస్ మోషన్.
పై లక్షణాలు రెండు రోజులకు మించి ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
డయేరియా సోకిన రెండు రోజుల తర్వాత మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. తీవ్రమైన కడుపు నొప్పి లేదా మలనొప్పి వస్తుంది. ఈ సమయంలో జ్వరం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ముఖ్యంగా చిన్నపిల్లల్లో అతిసారం త్వరగా డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
డయేరియాకు కారణాలు:
డయేరియా రోటవైరస్ వంటి వైరస్లు, E. కోలి వంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. యాంటీబయాటిక్స్ వంటి మందులు విరేచనాలు, జీర్ణ సమస్యలు, కొన్ని ఆహార ఉత్పత్తులతో సహా డయేరియాకు కారణమవుతాయి.
డయేరియాకు చికిత్స:
అతిసారం సోకితే కొన్ని సందర్భాల్లో చికిత్స లేకుండా కొన్ని రోజుల్లో దానంతట అదే నయం అవుతుంది. కానీ మరింత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం బెటర్.
జాగ్రత్తలు:
డయేరియా సోకకుండా పరిసరాల పరిశుభ్రతతో పాటు పిల్లలను శుభ్రంగా ఉంచడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలను బహిరంగ మల విసర్జనకు పంపితే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. వాంతులు, విరేచనాలు అవుతుంటే కాచి వడబోసిన నీరు, మజ్జిగ, బార్లీ ఓఆర్ఎస్ వంటి లిక్విడ్స్ ఎక్కువగా తాగించాలని వైద్యులు చెబుతున్నారు. తేలికగా జీర్ణం అయ్యే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం, కారం తగ్గించి ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా జంగ్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్ పూర్తిగా మానేయ్యాలి. వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతుంటే చిన్న పిల్లల వైద్యులకు చూపించాలని సూచిస్తున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజ్రుంభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేడి చేసిచల్లార్చిన నీరు తాగాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
Also Read: స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఏం చెయ్యాలి? వేడి నీళ్ల స్నానం ప్రమాదకరమా? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!