Jawaharlal Nehru Letter Row:నెహ్రూ లేఖ 80 ఏళ్ల తర్వాత ఎందుకు సంచలనం రేపుతోంది? అసలు ఏం జరిగింది?
Jawaharlal Nehru Letter: బీజేపీ-కాంగ్రెస్ మధ్య తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లేఖలవ్యవహారం దుమారం రేపుతోంది. లేఖలను సోనియా తీసుకువెళ్లి తిరిగి ఇవ్వకపోవడంపై వివాద చెలరేగింది.
Jawaharlal Nehru Letter To Edwina Mountbatten: భారత దేశ తొలిప్రధాని(First PM) జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru).. బ్రిటీష్ చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ సతీమణి ఎడ్వినా(Edwina) మౌంట్‌బాటన్‌తో సన్నిహితంగా మెలిగారన్న చర్చ తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. వారి మధ్య ఏదో నడించిందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే.. తాజాగా మరోసారి ఈ వ్యవహారం తెరమీదికి వచ్చింది. అప్పట్లో అంటే.. దాదాపు 80 ఏళ్ల కిందట (దేశానికి స్వాతంత్య్రం రాకముందు) ఎడ్వినాకు నెహ్రూ రాసిన లేఖ వ్యవహారం ఇప్పుడు చర్చకు వస్తోంది.
నెహ్రూ రాసిన పలు లేఖలను అప్పటి యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ తీసుకువెళ్లారని.. వాటిని తిరిగి ఇవ్వాలని కోరుతూ.. ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (PMML) సభ్యుడు డిమాండ్ చేయడంతో విషయం చర్చకు దారి తీసింది. అదే సమయంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయంగా కాక పెంచుతోంది. ఉద్దేశ పూర్వకంగానే నెహ్రూ రాసిన లేఖలను దాచి పెడుతున్నారని బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏం జరిగింది?
తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. ఎడ్వినా మౌంట్‌బాటన్, జయప్రకాశ్ నారాయణ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మొదలైన వారికి వ్యక్తిగతంగా అప్పట్లో లేఖలు రాశారు. ఇవి జరిగి 80 ఏళ్లు గడిచాయి. వీటిలో ఎడ్వినాకు రాసిన లేఖలు ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉన్నాయి. వీరి మధ్య ప్రేమాయణం సాగిందన్న చర్చ కూడా ఉంది. అయితే.. ఈ లేఖలు 2008వ సంవత్సరం వరకు ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (PMML) భద్రంగా ఉన్నాయి. ఆ తర్వాత.. దాదాపు 51 ట్రంకు పెట్టెల్లో ఉన్న ఆయా లేఖలను కేంద్రంలో యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ(UPA) చైర్ పర్సన్‌గా వ్యవహరించిన సోనియాగాంధీ తన నివాసానికి తరలించారు. దీనికిగాను ఆమె ఒక సహాయకుడిని కూడా సోనియా నియమించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీటిలో నెహ్రూ-ఎడ్వినాకు రాసిన లేఖలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
Also Read: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
ఇప్పుడు విషయం ఏంటంటే..
సోనియా గాంధీ(Sonia Gandhi) తీసుకు వెళ్లిన సదరు లేఖలను తిరిగి ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (PMML)కు స్వాధీనం చేయాలని కోరుతూ.. పీఎంఎంఎల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ ఖాద్రీ.. ఈ ఏడాది సెప్టెంబరులో సోనియాగాంధీకి లేఖ రాశారు. అయితే.. ఆమె స్పందించలేదు. దీంతో తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, సోనియా కుమారుడు రాహుల్ (Rahul gandhi)కు కూడా ఆయన లేఖ సంధించారు. లేఖలను వెనక్కి ఇచ్చేలా సోనియాగాంధీని ఒప్పించాలని, ఒకవేళ ఆమె అందుకు అంగీకరించని పక్షంలో ఫోటోకాపీ లేదా డిజిటల్ వెర్షన్‌ను అయినా తమకు అందించాలని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో రిజ్వానా(Rijwana) విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలు ఎడ్వినా మౌంట్‌బాటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయ లక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్‌తో నెహ్రూ కమ్యూనికేషన్‌లకు సంబంధించినవని ఖాద్రీ చెప్పారు. ఈ పత్రాలు పరిశోధకులకు, స్కాలర్‌లకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు లేఖలను తిరిగి ఇవ్వాలని సూచించారు.
బీజేపీ విమర్శలు..
తొలి ప్రధాని నెహ్రూ రాసిన లేఖలను తీసుకువెళ్లడం ద్వారా ఏదో విషయం దాచాలనే ప్రయత్నం చేస్తున్నారని సోనియా గాంధీపై బీజేపీ(BJP) ఎంపీ(MP) సంబిత్ పాత్రా(Sambith Patra) ఆరోపించారు. పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా ఇదేవిధంగా స్పందించారు. "భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎడ్వినా మౌంట్‌బాటన్‌కు రాసిన లేఖలను సోనియా గాంధీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిలో రహస్యం ఏమిటి? దేశం సోనియా గాంధీ సమాధానం చెప్పాలి`` అని భండారీ ప్రశ్నించారు.
ఎడ్వినా కుమార్తె వెర్షన్ ఇదీ..
ఎడ్వినాకు నెహ్రూ రాసిన లేఖలపై ఎడ్వినా కుమార్తె పమేలా(Pamela) హిక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె రాసిన `డాటర్ ఆఫ్ ఎంపైర్: లైఫ్ యాజ్ ఎ మౌంట్ బాటన్`(Daughter of Empire: Life as a Mountbatten) అనే పుస్తకంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. తన తల్లికి, నెహ్రూకి మధ్య "గాఢమైన సంబంధం" ఉందని ఆమె రాశారు. వీరి స్నేహం 1947లో ప్రారంభమైందని తెలిపారు. అంతేకాదు.. 'ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు` అని కూడా స్పష్టం చేశారు. ``ఆయన, మా అమ్మ ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో.. ఎంతగా గౌరవించుకున్నారో.. లేఖలు చెబుతున్నాయి. ఎడ్వినా... నెహ్రూలో తాను కోరుకున్న ఆధ్యాత్మికత, తెలివి తేటలు ఉన్నాయని, అందుకే ఆయనతో సాహచర్యం, సాన్నిహిత్యం కోరుకున్నారు. నా తల్లికి, పండిట్‌జీకి శారీరక సంబంధాలు పెట్టుకోవడానికి సమయం లేదు. వారు చాలా అరుదుగా కలుసుకునేవారు. వారి చుట్టూ ఎప్పుడూ భద్రతా సిబ్బంది, పోలీసులు భారీ సంఖ్యలో ఉండేవారు. అయితే, మా అమ్మ ఎడ్వినా భారతదేశాన్ని విడిచిపెట్టబోతున్నప్పుడు.. నెహ్రూకు `పచ్చ ఉంగరం` కానుకగా ఇచ్చింది. కానీ, ఆయన దానిని తీసుకోకుండా.. తన కుమార్తె ఇందిరకు ఇచ్చారు. ఎడ్వినాకు నెహ్రూ వీడ్కోలు పలికిన సందర్భంలో "మీరు ఎక్కడికి వెళ్లినా, మీరు ఓదార్పుని, ఆశను, ప్రోత్సాహాన్ని అందించారు, భారతదేశ ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మిమ్మల్ని తమలో ఒకరుగా భావిస్తారు`` అని నెహ్రూ పేర్కొన్నారు`` అని పమేలా తన పుస్తకంలో రాయడం విశేషం.
Also Read: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !