Sitting Hours: గంటల కొద్దీ కూర్చుని ఉంటే... ప్రాణానికే ముప్పు... తస్మాత్ జాగ్రత్త
కదలకుండా కూర్చోవడం వల్ల అధిక రక్తపోటు తలెత్తడం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా పుణ్యమా అని ఎంతో మంది WFH చేస్తున్నారు. దీంతో గంటలకొద్దీ తెలియకుండా కంప్యూటర్ల ముందు మకాం వేస్తున్నారు. ఇలా కదలకుండా కూర్చోవడం వల్ల అధిక రక్తపోటు తలెత్తడం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని వైద్యులు చెబుతున్నారు.
కేవలం కూర్చోవడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుంటే మీరే షాక్ అవుతారు. కంప్యూటర్ ముందు కూర్చుని గంటలతరబడి పనిచేయటం, గంటలకొద్దీ డ్రైవ్ చేయడం వంటివి దీర్ఘకాలంలో ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ధూమపానం, ఊబకాయం వల్ల ఎలాంటి ప్రాణాంతకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో రోజుకు 8 గంటల పాటు కూర్చోవడం వల్ల కూడా అలాంటి అనారోగ్య సమస్యలే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అధ్యయనాల్లో తేలినట్టు తెలిపారు. పగటివేళల్లో తక్కువగా కూర్చోవడం, పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చట. కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాలు చేస్తున్నారని.. వారందరూ కూడా ఎక్కువ సమయం కూర్చోకుండా జాగ్రత్తపడాలి.
నిల్చోవడం, నడవడం వంటి చర్యలతో పోల్చితే కూర్చోవడం వల్ల చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల ఊబకాయం రావటం, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చోవడానికి, అనారోగ్య సమస్యలకు దారితీసే కారకాలకు మధ్య ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకోవడానికి పలు అధ్యయనాలు జరిగాయని.. ఆ అధ్యయనాలలో ఎవరైతే కదలకుండా రోజుకు 8 గంటలకు పైగా కూర్చున్నారో వారి ప్రాణాలకు అధికంగా ముప్పు ఉన్నట్టు తేలిందట.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు
* ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాలు, పిరుదు కండరాలు శక్తి హీనంగా తయారవుతాయి. నడవడానికి, స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడే ఈ పెద్ద కండరాలు బలహీనంగా తయారైతే... వ్యాయామాల చేసినా, కిందపడినా తీవ్రమైన గాయాలవుతాయి.
* గంటల కొద్దీ కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్ద ప్రేగు క్యాన్సర్లతో సహా మరికొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
* రోజులో ఎక్కువ సార్లు కండరాలను కదిలించడం వల్ల శరీరంలోని కొవ్వులు, చక్కెరలు సంపూర్ణంగా జీర్ణమవుతాయి. ఒకవేళ మనం రోజంతా కూర్చున్నట్లయితే, జీర్ణక్రియ వ్యవస్థ బలహీనపడి శరీరంలో కొవ్వులు, చక్కెరలు కరగక అలాగే స్టోర్ అవుతాయి.
* గంటలకొద్దీ కూర్చోవడం వల్ల తొడ కండరాలు కుచించుకుపోయి జాయింట్ పెయిన్ వస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కఠినమైన ఎక్సర్సైజ్ చేసినా ఎటువంటి ఫలితం ఉండదు.
రోజంతా యాక్టివ్ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. కూర్చొని పనులు చేసేవారు 30 నిమిషాలకొకసారి నిల్చోని అటు ఇటు తిరగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. నిలబడి వర్క్ చేసినా.. ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. టీవీ చూస్తున్నప్పుడు లేదా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా నడవటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.