Corn Dosa: మొక్కజొన్న గింజల దోశ, అప్పుడప్పుడు తింటే ఎంతో బలం
మొక్కజొన్న గింజలతో వేసిన దోశలు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఎంతో బలం.
ఎప్పుడూ ఒకేరకమైన దోశెలు తిని బోరు కొట్టిందా? అయితే ఈసారి మొక్కజొన్న గింజలతో దోశెలు చేసుకుని తింటే ఎంత బావుంటుందో. వీటిని చేసుకోవడం చాలా సులువు. పిల్లలకు వీటిని పెట్టడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కావాల్సిన పదార్థాలు
పచ్చి మొక్కజొన్న గింజలు - మూడు కప్పులు
మినపప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు
ఎండు మిర్చి - ఒకటి
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూను
తయారీ ఇలా
1. మొక్కజొన్న గింజలు, మినపప్పులను ముందే నానబెట్టుకోవాలి. మినపప్పును మాత్రం నాలుగ్గంటలు నానబెట్టుకోవాలి. మొక్కజొన్నలు అరగంటైనా చాలు
2. వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. అందులోనే పచ్చిమిర్చి, వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
4. ఇప్పుడు ఆ రుబ్బును ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
5. దోశెలు వేసుకోవడానికి వీలుగా నీళ్లు కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి వేడెక్కాక దోశెలు వేసుకోవాలి.
7. వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
మొక్కజొన్నలు తింటే...
మొక్కజొన్న గింజలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. మొక్కజొన్నని ఉడకబెట్టుకుని తింటే ఎంతో లాభం. కాల్చుకుని తినడం వల్ల నల్లగా మాడిపోయిన పదార్థాలు కూడా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఉడకబెట్టుకుని తినడమే మంచిది. అలాగే వీటితో గారెలు చేసుకుని చికెన్ కూరతో తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. గారెలు చేసుకోవడం కష్టం అనుకుంటే దోశెలు వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. వీటితో చేసిన దోశెలు తినడం పోషకాహార లోపం ఉండదు. మొక్కజొన్నల్లో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డి కూడా కాస్త లభిస్తుంది. ఇందులో పుష్కలంగా పీచు ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. మలబద్ధకం సమస్య పూర్తిగా పోతుంది.పిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే వారికి మొక్కజొన్న గింజలతో చేసిన వంటకాలు పెడితే సులువుగా మల విసర్జన అవుతుంది. అలాగని రోజూ తినిపిస్తే ఇతర సమస్యలు రావచ్చు. రెండు రోజులకోసారి అరకప్పు కన్నా ఎక్కువ తినిపించవద్దు.
ఇన్‌స్టెంట్‌గా మొక్కజొన్న దోశ చేసుకోవాలంటే ఇలా ప్రయత్నించవచ్చు.
View this post on Instagram
Also read: మీకు మధుమేహం ఉందా? మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే