Salary Deposit: ఆ ఉద్యోగి జీతం 43 వేలు, అకౌంట్లో పడింది 1.4 కోట్లు - కంపెనీకే షాకిచ్చాడు, కానీ..
అకస్మాత్తుగా మీ అకౌంట్లో భారీ మొత్తం పడితే ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ‘బ్లాక్ మనీ’ని వెనక్కి తెచ్చి.. మీ అకౌంట్లో వేసిందనుకోవద్దు. ఎక్కడో పొరపాటు జరిగిందని భావించి తిరిగిచ్చేయండి.
నెల జీతంలో ఒక్క పైసా తగ్గినా హెచ్‌ఆర్‌ను నిలదీస్తాం. ఎందుకు తగ్గిందని ఆరా తీస్తాం. కానీ, పొరపాటున జీతాన్ని ఎక్కువ చేల్లిస్తే? అది మీకు రావల్సిన జీతం కంటే భారీగా ఉంటే? కొందరు వెంటనే హెచ్ఆర్‌కు రిపోర్ట్ చేస్తారు. లేదా పొరపాటు జరిగిందేమో, వాళ్లు వెనక్కి అడిగే వరకు చూద్దాంలే అని అనుకుంటారు. అయితే, ఇతడు మాత్రం అలా చేయలేదు. తనకు రావల్సిన రూ.43 వేల జీతం కంటే.. 286 రెట్లు ఎక్కువ మొత్తం అతడి అకౌంట్లో పడింది. అంత మొత్తాన్ని చూడగానే అతడికి మతిపోయింది. ఎన్నాళ్లు గొడ్డులా పనిచేసినా.. అంత మొత్తాన్ని సంపాదించలేం అని అనుకున్నాడో ఏమో.. ఎవరూ ఊహించని పని చేశాడు.
చిలీకి చెందిన ఓ ఉద్యోగికి ఊహించని అదృష్టం దక్కింది. ఫుడ్ ఇండస్ట్రియల్ కన్సార్టియంలో పనిచేస్తున్న వ్యక్తికి ఎప్పటిలాగానే నెల జీతం అతడి అకౌంట్‌లో పడిండి. జీతం అతడి అకౌంట్‌లో పడగానే.. మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. వాస్తవానికి అతడికి 500,000 పెసోలు (రూ. 43,000) అకౌంట్లో పడాలి. కానీ, 165,398,851 చిలీ పెసోలు (రూ. 1.42 కోట్లు) డిపాజిట్ అయ్యాయి. తొలుత ఆ నెంబర్లు చూసి అతడు అకౌంట్ నెంబర్ అనుకుని పొరబడ్డాడు. అకౌంట్ డిటైల్స్ చెక్ చేసిన తర్వాత తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అకౌంట్స్ డిపార్టుమెంట్‌లో ఉన్న ఓ ఉద్యోగి చేసిన పొరపాటు వల్ల ఈ సమస్య ఏర్పడింది.
మే 30న ఈ ఘటన చోటుచేసుకుంది. తన జీతం కంటే ఎక్కువ డబ్బులు అకౌంట్లో పడ్డాయని తెలిసిన వెంటనే అతడు.. కంపెనీని సంప్రదించాడు. తనకు రావల్సిన జీతం కంటే అదనంగా 165.3 మిలియన్ పెసోలు అకౌంట్లో పడ్డాయని చెప్పాడు. దీంతో ఆ మొత్తాన్ని కంపెనీ అకౌంట్లోకి తిరిగి చెల్లించాలని, వెంటనే బ్యాంక్‌కు వెళ్లి బదిలీ చేయండని అకౌంట్స్ సిబ్బంది అతడికి చెప్పారు. దీంతో అతడు బ్యాంకుకు వెళ్లి తనకు అదనంగా వచ్చిన డబ్బును బదిలీ చేస్తానని చెప్పాడు.
అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ కనిపించలేదు. అతడు డబ్బులు తిరిగి కంపెనీ అకౌంట్లో వేస్తాడని సిబ్బంది కళ్లు కాయలు కాచేలా చూశారు. గంటలు, రోజులు.. చివరికి నెల గడిచినా సరే అతడి నుంచి ఎలాంటి స్పందన లేదు. రిఫండ్ నోటిఫికేషన్స్ కూడా రాలేదు. అయితే, జూన్ 2న అతడు తన లాయర్‌తో కలిసి కంపెనీకి వచ్చాడు. తన రాజీనామా పత్రాన్ని ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి మళ్లీ అతడి ఆచూకీ లేదు. దీంతో ఆ కంపెనీ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి, అతడిని మనం లక్కీ ఫెలో అనాలా? చీటర్ అనలా? ఇందులో అతడి తప్పైతే లేదు. అది కంపెనీ పొరపాటే. కానీ, ఆ మొత్తాన్ని నిజాయితీగా తిరిగి చెల్లించకుండా, గైర్హాజరు కావడం మాత్రం నేరమే. మరి, అతడికి ఏ శిక్ష విధిస్తారో చూడాలి.
Also Read: వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ, ఇది వారసత్వంగా వస్తుందట!
Also read: మిగిలిపోయిన అన్నంతో ఇలా దోశెలు, టేస్టు అదిరిపోతుంది