వారాలు గడుస్తున్నా జలుబు తగ్గడం లేదా? అయితే మీకు లాంగ్ కోల్డ్ సమస్య ఉన్నట్టే
కొంతమందికి జలుబు వచ్చిందంటే వారాలు గడుస్తున్నా తగ్గదు. అలాంటివారు లాంగ్ కోల్డ్ సమస్యతో బాధపడుతున్నట్టు లెక్క.
కోవిడ్ వచ్చి తగ్గాక కొన్ని రకాల సమస్యలు ఇంకా బాధిస్తూనే ఉన్నాయి. కరోనా వచ్చి తగ్గిన వారిలో జలుబు తరచూ వచ్చి ఇబ్బంది పెడుతోంది. కొందరిలో వారాలు గడుస్తున్నా కూడా జలుబు తగ్గడం లేదు. దీన్నే లాంగ్ కోల్డ్ సమస్యగా గుర్తించారు వైద్యులు. ఇలా లాంగ్ కోల్డ్ సమస్యతో బాధపడే వారిలో కడుపునొప్పి, దగ్గు, అతిసారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. శ్వాసకోశ వైరస్ లేదా ఇతర ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వలనైన శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చి ఇలా జలుబు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా జలుబు వారం రోజుల్లో తగ్గిపోతుంది. అలాకాకుండా నెల రోజులపాటు కొనసాగిందంటే మీకు లాంగ్ కోల్డ్ సమస్య ఉన్నట్.టు లేదా రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.
ఒకప్పుడు కోవిడ్ బారిన పడిన వారిలో వందల మంది ఇప్పుడు లాంగ్ కోల్డ్ బారిన పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీరంతా కూడా కడుపునొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, ఏకాగ్రత లేకపోవడం, తల తిరగడం, కళ్ళు తిరగడం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇలాంటి లక్షణాలతో పాటు జలుబు కూడా ఉంటే మీకు లాంగ్ కోల్డ్ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
లాంగ్ కోల్డ్ సమస్యతో బాధపడేవారు ముందుగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. కేవలం కోవిడ్ బారిన పడిన వారిలోనే కాదు ఇతర శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారిలో కూడా ఇలా దీర్ఘకాలికంగా జలుబు వేధిస్తుంది. కాబట్టి దీర్ఘకాలంగా జలుబు ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ కోల్డ్ తో పోరాడటానికి ఎక్కువగా వేడిగా ఉన్న ఆహారాలను తినాలి. నీళ్లు కూడా చల్లటివి తీసుకోకూడదు. చల్లటి నీళ్లు తలస్నానం చేయకూడదు వేడివేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తినాలి. చికెన్ సూప్, చేపలు, గుడ్లు, పాలు బీన్స్ వంటివి అధికంగా తినాలి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తాయి. కివి పండ్లను కూడా అధికంగా తింటే మంచిది. దానిమ్మ, ఆపిల్ అధికంగా తింటే త్వరగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి నిండుగా ఉండే పదార్థాలను తింటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
Also read: విటమిన్ మాత్రలు సమర్థంగా పనిచేయాలంటే ఎప్పుడు, ఎలా వేసుకోవాలో తెలుసా?
Also read: తిన్నది అరగకపోవడం చిన్న సమస్య కాదు, క్యాన్సర్ సంకేతం కావచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.