Telugu Recipes: పుల్లపుల్లని చుక్కకూర చపాతీ, తింటే అందరికీ ఆరోగ్యమే
Telugu Recipes: చుక్కకూరతో చపాతీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
Telugu Recipes: చపాతీ ఒక్కటే తింటే బోరుకొట్టేస్తుంది. ఓసారి చుక్కకూర చపాతీ చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కోడిగుడ్డు పొరటుతో తింటే రుచి అదిరిపోతుంది. చుక్కకూర తినని వారు ఇలా చపాతీలు చేసుకుని తింటే అందులోని పోషకాలు అందుతాయి.
కావాల్సిన పదార్థాలు
చుక్కకూర - మూడు కట్టలు
గోధుమ పిండి - ఒక కప్పు
జీలకర్ర పొడి -అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
నూనె - మూడు స్పూన్లు
తయారీ ఇలా
చుక్కకూరను కట్ చేసి శుభ్రంగా నీళ్లలో కడుక్కోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక చుక్కకూర వేసి వేగించాలి. ఉప్పు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి కూడా వేసి కలపాలి. జీలకర్ర దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు చపాతీ పిండిని కలిపేందుకు సిద్ధం చేయాలి. అందులో చుక్క కూర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకుని పెనంపై వేసి కాల్చుకోవాలి. దీన్ని కోడి గుడ్డు కూరతో లేదా చికెన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది.
చుక్కకూర తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మలబద్ధకం సమస్య రాకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును మెరుగుపరస్తుంది. కామెర్లు వ్యాధి రాకుండా అడ్డుకునే శక్తి దీనికుంది. రేచీకటి సమస్యతో బాధపడేవారు రోజూ చుక్క కూరను తింటే ఎంతో ఆరోగ్యం. ఎముకలు గట్టిగా మారేందుకు ఇది సహాయపడుతుంది. మహిళలు, పిల్లలు రక్త హీనత సమస్య బారిన తరచూ పడుతూ ఉంటారు. ఆ సమస్య నుంచి బయటపడేసే శక్తి చుక్కకూరకు ఉంది. వారానికి కనీసం రెండు సార్లు కచ్చితంగా తినేలా చూసుకోవాలి. పిల్లలు చుక్క కూరతో చేసిన వంటకాలు ఇష్టపడకపోవచ్చు. అలాంటివారికి ఇలా చపాతీలు చేసి పెడితే చాలా మంచిది. శరీరంలో ఉన్న నొప్పులు, వాపులు వంటి వాటిని సహజంగా తగ్గించే శక్తి చుక్కకూరకు ఉంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే చుక్క కూరను తినడం అలవాటు చేసుకోవాలి. చర్మం కాంతివంతంగా మారాలన్నా కూడా ఈ ఆకు కూరను డైట్లో చేర్చుకోవాలి. ఇది మీకు అన్ని విధాలా మంచే చేస్తుంది. చుక్క కూరలో ఎండు రొయ్యలు వేసుకుని కూరగా వండుకుంటారు చాలా మంది. అది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Also read: గంటలు గంటలు కూర్చుని అతిగా పనిచేసేస్తున్నారా? గుండెపై ప్రభావం పడక తప్పదు
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని అర్థం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.