వీడియో గేమ్స్ ఆడే పిల్లలు జాగ్రత్త, వారిలో ప్రాణాంతక పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు
వీడియో గేమ్స్ ఆడే పిల్లలున్న తల్లిదండ్రులకు ఇది హెచ్చరికే అనుకోవాలి.
టెక్నాలజీ పెరిగాక పిల్లల ఆటతీరు మారిపోయింది. ఆరు బయట ఆటలు కనుమరుగైపోయాయి. పూర్తిగా ఫోన్లలో గేమ్స్ కు, వీడియో గేమ్స్‌కు అలవాటు పడిపోయారు. కొందరైతే అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. వారి పుట్టినరోజుకు ప్లే స్టేషన్లు బహుమతులుగా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతో మంది. అలాంటి తల్లిదండ్రులకు ఓ కొత్త పరిశోధన హెచ్చరిక లాంటి ఫలితాన్ని ఇచ్చింది. డబ్బులున్నాయి కదా అని వేలుకు వేలు ఖర్చుపెట్టి ప్లే స్లేషన్లు కొని ఇస్తుంటారు. అలా ఇచ్చి మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే చేతులారా చెడుగొడుతున్నట్టు.
ఏమిటీ అధ్యయనం?
ఆస్ట్రేలియా హార్ట్ సెంటర్ ఫర్ చిల్ట్రన్ సంస్థకు చెందిన పరిశోధకులు పిల్లలపై వీడియో గేమ్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకునేందుకు అధ్యయనాన్ని నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వారి అధ్యయన వివరాలను హార్ట్ రిథమ్ అనే జర్నల్ లో ప్రచురించారు.చిన్నారులు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు వారి గుండెపై పడే ఒత్తిడిని గమనించారు. కొంతమంది పిల్లల గుండె కొట్టుకునే వేగం క్రమబద్ధంగా లేకపోవడాన్ని కనిపెట్టారు. ఇలాంటి చిన్నారులు ఒత్తిడి వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా యుద్ధాల వీడియో గేమ్‌లు ఆడే పిల్లల్లో ఏకంగా గుండె ఆగిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయని గుర్తించారు. యుద్ధాల వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో చాలా మంది స్పృహ కోల్పోయినట్టు చెప్పారు పరిశోధకులు. అధ్యయనం చేస్తున్నప్పుడే ఒక పిల్లాడు కొంతమంది స్పృహ కోల్పోయారని చెప్పారు పరిశోధకులు. యుద్ధం గేమ్స్ అంటే పబ్ జీ వంటివి. ఇందులో మల్టీ ప్లేయర్స్ ఉంటారు. ఇలాంటి ఆటలకు పిల్లలను చాలా దూరంగా ఉంచాలి.
పిల్లలకు వీడియోగేమ్స్ ఇవ్వడం అంత అవసరమా అనేది తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. ఆడుకోవడానికి ఎన్నో ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉన్నాయి. వాటిని కొనకుండా వేలకు వేలు ఖరీదు చేసే ప్లే స్టేషన్లు, ఫోన్లు కొనిచ్చి వారి ఆరోగ్యాన్ని చేతులారా చెడుగొట్టుకుంటున్నారు చాలా మంది తల్లిదండ్రులు. పిల్లలు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే వారిని వీడియో గేమ్స్ కు దూరంగా ఉంచాలి.
Also read: కుంకుమ పూవు ఎందుకంత ఖరీదు? దీన్ని తింటే పిల్లలు తెల్లగా పుడతారన్నది ఎంతవరకు నిజం?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.