చెడు కొలెస్ట్రాల్ ఎంతుందో చెక్ చేసుకుంటున్నారా? 40 ఏళ్లు దాటితే ఈ పరీక్ష తప్పదు
కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలన్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఇది చాలా అవసరం.
డయాబెటిస్, అధిక రక్తపోటు, పల్స్ ఈ మూడే ఎక్కువగా చెక్ చేసుకుంటారు చాలా మంది. వీటితో పాటూ కనీసం ఆరునెలలకోసారైనా మరికొన్ని పరీక్షలు చేయించు కోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వయసు పెరిగాక అంటే 40 ఏళ్లు దాటాక కచ్చితంగా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ అనగానే చాలా మంది మేము లావుగా లేము కదా, మాకు ఆ టెస్టు అవసరం లేదు అనుకుంటారు. కానీ లావుగా ఉన్న వారికి కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది, సన్నగా ఉన్నవారికి తక్కువగా ఉంటుంది అని కాదు. ఎవరైనా సరే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ఎంత శాతం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకుని ఆహారపరంగా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (హెచ్డిఎల్)స్థాయిలు కూడా ఎంతున్నాయో తెలుసుకుని, తక్కువుంటే వాటిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయని ముందే చెప్పుకున్నాం. వీటిలో చెడు కొలెస్ట్రాల్ అంటే ‘లో డెన్సిటీ లిపో ప్రోటీన్’ (LDL). ఇక మంచి కొలెస్ట్రాల్ ‘హై డెన్సిటీ లిపోప్రొటీన్’ (HDL).
చెడు కొలెస్ట్రాల్ పెరిగితే...
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీని వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్, స్ట్రోక్ వంటి ప్రమాదం వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ఒంట్లో పెరగకుండా చూసుకోవాలి.
మంచి కొలెస్ట్రాల్ తగ్గితే...
హెచ్డిఎల్ అనేది అధిక సాంద్రత కలిగిన లిపో ప్రొటీన్. ఇందులోని కణాలు దట్టంగా ఉంటాయి. అందుకే అధిక సాందత్ర కలిగి ప్రొటీన్లు అంటారు. ఇది శరీరానికి అవసరమైన కొవ్వు. ఇది తగ్గితే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు ఈ మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్‌ను కాలేయానికి చేరవేస్తుంది. కాలేయం దాన్ని రీ ప్రాసెస్ చేసి చెడు కొలెస్ట్రాల్ ను బయటికి పంపేస్తుంది. అందుకే మంచి కొలెస్ట్రాల్ పెరిగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల గుండె పోటు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.
చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాల ఇవే...
1. పోషకాహారం తినకపోవడం
2. ఊబకాయం బారిన పడడం
3. వ్యాయామం చేయకపోవడం
4. ధూమపానం అధికంగా చేయడం
5. మద్యపానం
ఈ అలవాట్లు మీకుంటే వెంటనే వదిలేయండి. ఇవన్నీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
Also read: ఈ రెండు రకాల టీలు తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుందట, ఆ టీలు ఏంటంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.