Diabetes: ఈ రెండు రకాల టీలు తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుందట, ఆ టీలు ఏంటంటే
Diabetes: డయాబెటిస్ రాకుండా ఉండాలన్నా, వచ్చాక అదుపులో ఉండాలన్న రెండు రకాల టీలు ఉపయోగపడుతున్నాయట.
Diabetes: డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి యేటా పెరుగుతూ వస్తోంది. డయాబెటిస్ వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాంతక సమస్యలతో మరణిస్తున్నారు కూడా. అందుకే మధుమేహం విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఆహారంపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు. అలాగే నడక, వ్యాయామం కూడా డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అయితే ఒక కొత్త అధ్యయనం ప్రకారం టీ తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండే అవకాశం ఉందని వెల్లడైంది. రోజుకు రెండు నుంచి నాలుగు కప్పుల టీ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతోంది ఆ అధ్యయనం. అతిగా తాగితే మళ్లీ అనర్థమే కలుగుతుంది. రోజుకు నాలుగు కప్పుల టీ తాగే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం 17 శాతం తగ్గుతోందట. అలాగని అందులో గుప్పెడు చక్కెర వేసుకుని తాగితే ఫలితం లేదు.చక్కెర కలపని టీలే తాగాలి. టీ ఆకుల్లో ఉండే పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు...శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడతాయని చెబుతున్నారు అధ్యయనకర్తలు.
ఎలాంటి టీలు తాగాలి?
కప్పు టీలో రెండు స్పూన్ల చక్కెర వేసుకుని తాగితే ఫలితం ఉండదు. పైగా అలా తాగడం ప్రమాదకరం కూడా. చక్కెర అవసరం లేని టీలే తాగాలి. ముఖ్యంగా గ్రీన్ టీ, ఊలాంగ్ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీలను రోజుకు రెండు నుంచి నాలుగు కప్పులు తాగితే చాలు డయాబెటిస్ అదుపులో ఉండే అవకాశాలు పెరుగుతాయి. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనం వివరాలను తెలిపారు. గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ కణాల సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే టీలు డయాబెటిక్ వారికి మేలుచేస్తాయి.
ఊలాంగ్ టీ అంటే...
గ్రీన్ టీ అంటే అందరికీ తెలిసిందే. మార్కెట్లో దీని అమ్మకాలు కూడా బాగా ఉన్నాయి. అయితే ఊలాంగ్ టీ అంటే మాత్రం చాలా మందికి తెలియదు. ఇది కామోలియా సైనెసెస్ అనే మొక్క నుంచి సేకరించే ఆకుల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఆ మొక్క ఆకులను మంచి ఎండలో నల్లగా మాడిపోయేవరకు ఎండబెడతారు. ఈ ఆకులు పాక్షికంగా ఆక్సీకరణం చెందుతాయి. ఊలాంగ్ టీ ప్యాకెట్లు ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. గ్రీన్ టీలాగే ఊలాంగ్ టీని కూడా తయారుచేసుకోవాలి. గ్రీన్ టీ తరువాత అంతే ఆరోగ్యకరమైన తేనీరు ఊలాంగ్.
Also read: ఈ సమస్యలు ఉన్నవాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకపోవడమే బెటర్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.