Car Wash at Home : ఇంట్లో కారు వాష్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి.. పర్ఫెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఇదే
Home Car Wash Tips : డబ్బు ఆదా కోసం ఇంట్లో కారు కడగాలనుకుంటే కొన్ని తప్పులు చేయకండి. కానీ ఈ టిప్స్ ఫాలో అయితే మంచిగా క్లీన్ అవుతుంది.

Car Washing Mistakes : ఇటీవల చాలామంది తమ కార్లను ఇంట్లో కడగడానికి ఇష్టపడుతున్నారు. వీకెండ్స్, సెలవుల సమయంలో పిల్లలతో లేదా పార్టనర్‌తో కలిసి దీనిని వాష్ చేస్తూ.. టైమ్ గడిపేస్తున్నారు. అలాగే ఇలా ఇంట్లో కారు వాష్ చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. సమయం కూడా మిగులుతుంది. కానీ సరైన పద్ధతిలో కారును శుభ్రం చేయకపోతే.. అది కారుకు నష్టం కలిగించవచ్చు. చిన్న చిన్న తప్పుల వల్ల కారు పెయింట్, గ్లాస్, బాడీపై ప్రభావం చూపుతాయి. అందుకే కారు వాష్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా ఇంట్లోనే కారును కడుగుతుంటే.. ఏ తప్పులు చేయకూడదో.. కారు వాష్ చేయడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.
ఈ ఇంటి చిట్కాలతో జాగ్రత్త
చాలామంది కారును కడగడానికి డిష్‌వాష్ లిక్విడ్, బట్టలు ఉతికే డిటర్జెంట్ లేదా షాంపూని ఉపయోగిస్తారు. ఇది అతి పెద్ద తప్పు. ఈ ఉత్పత్తులు కార్ల పెయింట్ కోసం తయారు చేసినవి కావు. దీనివల్ల ఏమవుతుందంటే.. నెమ్మదిగా దానిపై పొర డ్యామేజ్ అవుతుంది. అదనంగా నిమ్మకాయ, బేకింగ్ సోడా, వెనిగర్ వంటి గృహ చిట్కాలు కూడా కారుకు హానికరం. వాటిలోని రసాయనాలు పెయింట్ మీద చిన్న గీతలు ఏర్పరుస్తాయి. మెటల్ భాగాలపై తుప్పు పట్టే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి కారును శుభ్రపరుస్తాయి. కానీ కాలక్రమేణా కారు మెరుపు, విలువ రెండింటినీ తగ్గిస్తాయి. అందుకే ఎప్పుడు కారు వాష్ చేసినా.. కార్ల కోసం తయారు చేసిన ప్రత్యేక షాంపూనే ఉపయోగించాలి.
ఎండలో కడిగితే..
చాలామంది కార్లను శుభ్రం చేయడానికి పాత బట్టలు, టవల్ లేదా టీ-షర్టులను ఉపయోగిస్తారు. ఇది కూడా ఒక పెద్ద తప్పు. ఈ బట్టలలో దుమ్ము ఉంటుంది. ఇది కారు బాడీపై గీతలు ఏర్పరుస్తుంది. ముఖ్యంగా ముదురు రంగు కార్లలో ఇది త్వరగా కనిపిస్తుంది. అదనంగా ఎండలో కారును కడగడం కూడా మంచిది కాదు. వేడిలో నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీని వలన కారుపై నీటి మరకలు ఏర్పడతాయి. ఇది కారు మెరుపును తగ్గిస్తుంది. పెయింట్ త్వరగా పాడవుతుంది. మీ కారు ఎల్లప్పుడూ శుభ్రంగా, మెరుస్తూ ఉండాలని మీరు కోరుకుంటే.. దానిని ఎల్లప్పుడూ నీడలో లేదా చల్లని ప్రదేశంలో కడగాలి.
సరైన పద్ధతి ఇదే..
కారును కడగడానికి సరైన మార్గాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ కారు దిగువ భాగం, టైర్ల నుంచి క్లీన్ చేయడం ప్రారంభించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మురికి ఉంటుంది. తరువాత పై బాడీ, రూఫ్‌ను శుభ్రం చేయండి. మైక్రోఫైబర్ వస్త్రం లేదా స్పాంజ్‌ని ఉపయోగించండి. ఎందుకంటే ఇది పెయింట్‌కు నష్టం కలిగించదు. అలాగే ఎప్పుడూ కార్ వాష్ షాంపూని ఉపయోగించండి. ఆధునిక కార్లలో మల్టీ లేయర్ పెయింట్ ఉంటుందని నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. దీనికి సరైన సంరక్షణ అవసరం. తప్పు పద్ధతిలో శుభ్రం చేస్తే ఈ పొర నెమ్మదిగా పాడవుతుంది.
























