Banana: వానాకాలంలో అరటి పండ్లు తినొచ్చా? పిల్లలకు పెట్టొచ్చా?
(Banana) అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే వానాకాలంలో ఈ పండును తినవచ్చా అనే చాలా మంది సందేహం.
Banana and Monsoon: అరటిపండు చలువు చేస్తుందని చెబుతారు పెద్దలు. అదే నిజం కూడా. అసలే చల్లగా ఉండే ఈ వానాకాలంలో అరటిపండును తినవచ్చా? పిల్లలచేత తినిపించవచ్చా? అనేది ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం. ట్రావెలింగ్ లో ఉత్తమ ఆహారం ఏదంటే అరటి పండనే చెప్పాలి? ఇలా తినగానే అలా శక్తి వచ్చేస్తుంది. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వానాకాలంలో ఈ పండును తినవచ్చో లేదో ఆరోగ్యనిపుణులు ఇలా వివరిస్తున్నారు.
తినవచ్చా లేదా?
మండుతున్న వేసవి నుంచి కాస్త ఉపశమనం కలిగేలా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చాయి. అంతేనా వారం రోజుల పాటూ మనుషులను ఇంటికే కట్టి పడేసాయి. వరదలతో ముంచెత్తాయి. కాకపోతే ఈ వానాకాలంలో వ్యాధులు కూడా త్వరగా ప్రబలుతాయి. జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువ మందిని వేధిస్తాయి. మరి చలువచేసే అరటి పండును తినవచ్చా? అంటే ఆరోగ్యనిపుణులు హ్యపీగా తినవచ్చని చెబుతున్నారు. అరటిపండ్లను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో అమైనో ఆమ్లాలు, విటమిన్ బి6, సి విటమిన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు పనితీరును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్ట్రోక్స్ ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి వానాకాలంలో కూడా అరటిపండ్లు లాగించవచ్చు.
వీరు తినకూడదు
అజీర్ణం, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు మాత్రం రాత్రి పూట అరటిపండ్లు తినడం మానేయాలి. ఇవి కఫదోషాన్ని పెంచుతుంది. శ్లేష్మం అధికంగా ఏర్పడేలా చేస్తుంది. అందుకే ఎప్పుడైనా ఉదయం పూట అరటిపండ్లు తినాలి. ఇలా తినడం వల్ల ఈ పండులో ఉండే ప్రొటీన్, ఫైబర్ జీర్ణం కావడానికి తగినంత సమయం ఉంటుంది.
వీటితో కలిపి తినకూడదు
ఆయుర్వేదం చెప్పిన ప్రకారం అరటిపండ్లతో పాటూ కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. ముఖ్యంగా పాలు. అరటిపండు తిన్న వెంటనే పాలు తాగకూడదు. అది విషపూరితంగా మారుతుంది. ఈ రెండూ జీర్ణవ్యవస్థలో యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతాయి. దీనివల్ల కఫదోషం పెరుగుతుంది.
వానాకాలంలో శరీరం చాలా మార్పులు చెందుతుంది. రోగనిరోధక శక్తి కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. కాబట్టి అరటిపండు తినడం వల్ల రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. పిల్లలకు కూడ ఉదయం పూటే తినిపించాలి. రాత్రి పూట తినిపించడం వల్ల కఫం పట్టే అవకాశం ఉంది.
Also read: ఒమిక్రాన్ BA.5 మిగతా వేరియంట్లతో పోలిస్తే చాలా పవర్ ఫుల్, వ్యాక్సిన్ వేసుకున్నా వదలడం లేదు
Also read: చిన్న చేపలు ఇలా ఫ్రై చేస్తే టేస్టు మామూలుగా ఉండదు