Brain Tumour: మీ మెదడు జాగ్రత్త, ఇవి బ్రెయిన్ ట్యూమర్ ముప్పును పెంచేస్తాయ్!
గుండె జబ్బులంత సాధారణంగా కనిపించే అనారోగ్యం కాదు కానీ బ్రెయిన్ ట్యూమర్ చాలా ఆందోళన కలిగించే సమస్య. సమయానికి గుర్తించి చికిత్స అందక పోతే ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. .
మన దేశంలో కేంద్రీయ నాడీ వ్యవస్థకు సంబంధించిన ట్యూమర్ల సమస్యలు 5-10 శాతం వరకు ఉండొచ్చని నిపుణుల అంచనా. అయితే ఈ రేటు రోజురోజుకు పెరుగుతుందని కూడా డాక్టర్లు హెచ్చిరిస్తున్నారు. మెటాస్టిక్ బ్రెయిన్ ట్యూమర్లు క్యాన్సర్ మెదడు వరకు వ్యాపించినపుడు ఇవి కనిపిస్తాయి. మెదడు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో క్యాన్సర్లు పిల్లల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో రెండవదని చెప్పవచ్చు. అంతేకాదు పిల్లల్లో కనిపించే క్యాన్సర్లలో దీని ప్రివిలెన్స్ 26 శాతం వరకు ఉంటుంది.
కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి కూడా. మిగతావి జీవన శైలికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్ల వల్ల సోకవచ్చు. అవగాహన కలిగి ఉంటే ఇలాంటి ట్యూమర్లను మనం నివారించడం సాధ్యమవుతుంది. బ్రెయిన్ ట్యూమర్ల గురించి సామాన్య ప్రజలకు తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి. ఈ కింది విషయాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
ఇన్ఫెక్షన్లు
టాక్సోప్లాస్మా గొండి ఇన్ఫెక్షన్ అనేది నాడీకణజాలానికి సోకుంతుంది. దీని ప్రభావంతో మెదడులో సిస్ట్ లు ఏర్పడుతాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా నాడీ కణజాలానికి సోకే ఎక్కువగా కనిపించే ఇన్ఫెక్షన్ గా నిపుణులు చెబుతున్నారు. దాదాపుగా 3 వంతుల జనాభా ఈ పరాన్నజీవిని క్యారీ చేస్తున్నారట. ఈబీవి ఇన్ఫెక్షన్ ఇది సీఎన్ఎస్ లింఫోమా కు కారణం కావచ్చు. మరో వైరస్ సైటో మెగాలో వైరస్ ఈ వైరస్ ను కూడా చాలా బ్రెయిన్ ట్యూమర్ కణజాలాల్లో కనుగొన్నారు.
ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలు
సెల్ ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని, వీలైనంత ఎక్కువగా హ్యాండ్ ఫీ హెడ్ సెట్ వాడడం మంచిదని డబ్ల్యూహెచ్ ఓ సూచిస్తోంది. ఈ జాగ్రత్త పిల్లలు పెద్దలందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ నుబాగా తగ్గిస్తుంది. స్వీడిష్ పరిశోధకులు తమ అధ్యయనంలో దీర్ఘకాలికంగా సెల్ ఫోన్ వాడకం, బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ మధ్య సంబంధాన్ని గురించి ఆంకాలజీ 2 జర్నల్ లో వివరించారు.
రసాయనాలను మనం జీవితం నుంచి పూర్తిగా బహిష్కరించడం సాధ్యం కాని విషయం. షాంపూలు, సోపులు, పౌడర్ల వంటి కొన్ని ఉత్పత్తుల్లో వాడే రసాయనాలు బ్రెయిన్ ట్యూమర్ కు కారణం కావచ్చు. ఏదైనా ప్రాడక్ట్ వాడే ముందు దాని లేబుల్ ను పూర్తిగా చదవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నివాస ప్రాంతం లేదా పనిచేసే ప్రాంతం బాగా కాలుష్యంతో కూడుకున్నదయితే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా చెబుతున్నారు.
హర్మోనల్ ఇంబాలెన్స్
హార్మోన్లు కూడా బ్రెయిన్ ట్యూమర్ కు కారణం కావచ్చు. టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ చికిత్స తీసుకున్న పురుషుల్లో, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న మహిళల్లో కూడా రిస్క్ ఎక్కువ అని చెప్పవచ్చు. మెనోపాజ్ లో ఉన్న వారిలో హెచ్ఆర్టీ చికిత్స తీసకున్న వారిలో మెనింజియోమా అనే ట్యూమర్ డెవలప్ కావచ్చు. గర్భనిరోధకాలుగా హార్మోన్లను ఇంజక్షన్లు, ఇంప్లాంట్లు, ఇంట్రాయుటరైన్ డివైజులుగా తీసుకున్న వారిలో కూడా ట్యూమర్లు ఏర్పవచ్చు.
తలకు గాయాలు, మూర్ఛ
చాలా సందర్భాల్లో తలకు బలమైన గాయాలైనపుడు మెనింజియోమా అనే ట్యూమర్ మెదడులో ఏర్పడడం గురించి చాలా అధ్యయనాలు చర్చించాయి. మూర్ఛతో బాధ పడుతున్న వారిలో కూడా బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
Also read: అబ్బాయిలూ జాగ్రత్త! టీనేజ్‌లో బరువు పెరిగితే ఆ క్యాన్సర్ ముప్పు తప్పదట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.