కాళ్లు, చేతులు విరిగినా ఈ పిల్లాడికి నొప్పి తెలియదు, ఇదో వింత వ్యాధి
‘నొప్పి’ని భరించడం చాలా కష్టం. అందుకే చాలామంది ‘నొప్పి’ తెలియకపోతే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ, అది వరం కాదు, శాపం. ఎందుకో తెలియాలంటే ఈ బాలుడి పరిస్థితి గురించి తెలుసుకోవాలి.
ఎవరికైనా దెబ్బతగిలితే విలవిల్లాడిపోతారు. కానీ, నొప్పి తట్టుకోలేక ఏడ్చేస్తారు. కానీ, ఈ పిల్లాడు ఆ టైపు కాదు. దెబ్బ తగిలినా పట్టించుకోడు. నొప్పి రావడం లేదా? అని అడిగితే వెకిలి నవ్వు నవ్వుతాడు. ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావ్? అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. అబ్బా, దెబ్బలు తగిలినా నొప్పి ఉండదా? వీడు తప్పకుండా ‘సూపర్ హీరో’ అయిపోతాడని అనుకుంటున్నారా? కానీ, అదే అతడి ఆరోగ్య సమస్య. నొప్పి లేకపోవడం అతడికి మరింత హాని చేస్తుంది.
UKలోని నార్‌ఫోక్‌లోని నార్విచ్‌కు చెందిన జాక్ స్కిట్‌మోర్ అనే 9 ఏళ్ల బాలుడు ఈ అరుదైన జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టినప్పటి నుంచే ఈ పిల్లాడికి నొప్పంటే తెలియదు. అయితే, అతడి తల్లిదండ్రులు ఇది గుర్తించలేదు. జాక్ శిశువుగా ఉన్నప్పుడు నర్సు అతడికి ఇంజక్షన్ పొడించింది. సాధారణంగా ఆ సూది నొప్పికి పిల్లలు గొల్లుమని ఏడ్చేస్తారు. కానీ, జాక్ మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా స్పందించలేదట. అప్పుడే నర్సు ఆశ్చర్యపోయింది.
ఆ తర్వాత పేరెంట్స్‌కు అసలు కష్టాలు మొదలయ్యాయి. ఏడాది వయస్సులో అతడు తనకు తెలియకుండా నాలుక కరుచుకున్నాడు. కానీ, ఆ నొప్పి అతడికి తెలియలేదు. రక్తం వస్తుందేమిటా అని చూస్తే నాలుక తెగి ఉంది. అప్పటి నుంచి తల్లిదండ్రులు జాక్‌పై ఓ కన్నేశారు. నాలుగేళ్ల వయస్సులో గోడ మీద దూకడంతో తుంటి పక్కకు కదిలింది. ఆ నొప్పి కూడా అతడికి తెలియలేదు. ఎవరి ప్రమేయం లేకుండా మళ్లీ అతడు తనికి తానే సెట్ చేసేసుకున్నాడు. సాధారణ వ్యక్తుల్లో అలా జరిగితే డాక్టర్లు మత్తుమందు ఇచ్చి మరీ సెట్ చేస్తారు. ఎందుకంటే.. అది అంత నొప్పి కలిగిస్తుంది. కానీ, జాక్‌కు అదేమీ తెలియరాలేదు.
ఆరేళ్ల వయస్సులో జాక్ కాలు విరగొట్టుకున్నాడు. నొప్పి తెలియకపోవడం వల్ల మూడు రోజులపాటు విరిగిన కాలుతోనే నడిచాడు. దాని వల్ల అతడు కాలు పక్కకు వంగింది. లక్కీగా తల్లిదండ్రులు గమనించి వైద్యులను ఆశ్రయించారు. అయితే, నొప్పి.. గాయాల గురించి తెలియకపోవడం వల్ల జాక్‌కు శరీరకంగా చాలా నష్టం కలిగింది. నొప్పి ఉంటే.. కనీసం గాయాన్ని గుర్తించి చికిత్స అందించవచ్చు. కానీ, జాక్‌కు అది అసాధ్యం.
జాక్‌కు ఉన్న సమస్యపై తల్లిదండ్రులు స్పందిస్తూ.. ‘‘నొప్పి ఒక ముఖ్యమైన సంకేతం. ఇది మన శరీరానికి అదనపు సంరక్షణ ఎప్పుడు అవసరమో తెలియజేస్తుంది. నొప్పి కలిగినప్పుడే శరీరంపై శ్రద్ధ కలుగుతుంది. బాధ నివారణ కోసం చికిత్స చేయించుకుంటాం. నొప్పి శరీర భాగాన్ని మరింత గాయపరచకుండా నివారిస్తుంది. కానీ, జాక్‌కు అది తెలీదు. నొప్పి తెలియకపోవడమే పెద్ద సమస్య’’ అని తెలిపారు.
జాక్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణం.. జన్యు లోపం. వైద్య పరిభాషలో దీన్ని ‘కంజెనిటల్ ఇన్‌సెన్సిటివిటీ టు పెయిన్ (CIP)’ అని అంటారు. జాక్ తల్లిదండ్రుల్లోని నిర్దిష్ట పరివర్తన చెందిన రెండు జన్యువుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు తెలిపారు. CIP సమస్య దాదాపు మిలియన్ జనాభాలోకి ఒకరికి మాత్రమే వస్తుందన్నారు. ఎక్కడైనా పడినప్పుడు, తన శరీరంలో ఏదైనా తేడా కనిపించినప్పుడు జాక్ చెప్పేవాడు కాదు. దాని వల్ల పరిస్థితి మరింత జఠిలంగా మారింది. పైగా ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంటుందనే సంగతి చాలామంది వైద్యులకు కూడా తెలీదు.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?
ఈ సమస్య నుంచి బయటపడేందుకు జాక్‌ను ప్రతి మూడు లేదా నాలుగు వారాలకు ఒకసారి చెకప్‌కు తీసుకెళ్తున్నాం. జాక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘అతడి పరిస్థితిని చూస్తే సూపర్ పవర్‌లా అనిపిస్తుంది. జాక్ రోగనిరోధక శక్తే అతడిని గాయానికి గురిచేస్తుంది. అతడు అందరి పిల్లల్లా ఫుట్‌బాల్, రగ్బీ తదితర ఆటలేవీ ఆడలేడు. ఆ సమయంలో గాయాలు తగిలినా అతడికి తెలియదు. ప్రస్తుతం యూకేలో ఆ బాలుడికి చికిత్స లభించలేదు.
Also Read: గుండె నొప్పిని మీ కాళ్లు ముందే హెచ్చరిస్తాయి, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!