Bone Tumors : ఎముకల్లో కణితులు.. ప్రమాదకరమైన ట్యూమర్స్, వాటి లక్షణాలు, చికిత్సలివే
Bone Tumor Causes : ఎముక కణితులు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. డాక్టర్ బ్రజేష్ నందన్ కారణాలు, లక్షణాలు, చికిత్సలు ఏంటో వివరించారు.

Bone Health : శరీరంలో కణితులు ఏర్పడడం వంటివి చూస్తూనే ఉంటాము. అయితే మీరు ఎముకల్లో ఏర్పడే కణితుల గురించి ఎప్పుడైనా విన్నారా? ఎముకల్లో ట్యూమర్స్ ఏంటి అనుకుంటున్నారా? అవును నిజమే బోన్స్‌లో ట్యూమర్స్ కూడా ఏర్పడతాయట. దీనిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే ఈ సమస్యపై అవగాహాన కల్పించాలని అంటున్నారు సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ చేస్తోన్న ఆర్థోపెడిక్స్ డాక్టర్ బ్రజేష్ నందన్. ఎముక కణితులు, వాటిలోని రకాలు, సమస్య రావడానికి కారణాలు, వయస్సు ప్రభావం ఎంత ఉంటుంది వంటి విషయాల గురించి ఆయన తెలిపారు.
"ఎముక కణితి అంటే ఎముకల్లో కణాలు అసాధారణమైన, అనియంత్రిత రీతిలో పెరిగిపోతాయి. ఇది ఎముకలో ఒక ముద్దగా పేరుకుపోతాయి. ఎముకల్లోని కణితలు ప్రాణానికి ముప్పు కానప్పటికీ.. ప్రాణాంతక కణితులు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చేసి ప్రమాదాన్ని పెంచుతాయి" అని డాక్టర్ నందన్ తెలిపారు. కాబట్టి సకాలంలో దానిని గుర్తించి.. చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం
ఎముక కణితులు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. పిల్లలు, కౌమారదశలో సాధారణంగా కనిపించే నిరపాయమైన ట్యూమర్స్‌తో పాటు.. వృద్ధులలో మెటాస్టాటిక్ ఎముక క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తాయి. రేడియేషన్ ఎక్స్పోజర్, జన్యుపరమైన సిండ్రోమ్‌లు, చికిత్స చేయని ఎముకల సమస్యలు బోన్స్ ట్యూమర్స్ ప్రమాదాన్ని పెంచుతాయి.
లక్షణాలు, రోగ నిర్ధారణ
ఎముక కణితులు తరచుగా నొప్పి లేకుండా లేదా నొప్పిని కలిగించే వాపు వంటి లక్షణాలతో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో.. ఎముకల్లో పగుళ్ల రూపంలో లక్షణాలు కనిపిస్తాయి. నొప్పి, వేగంగా వాపు రావడం, ప్రభావిత ప్రాంతం చుట్టూ కండరాల క్షీణత వంటి లక్షణాలు సాధారణంగా కనిపించే లక్షణాలు. ఎక్స్-రేలు MRI, CT స్కాన్‌లు, బయాప్సీ ద్వారా దీనిని నిర్ధారిస్తారు.
చికిత్స పద్ధతులు
"కీమోథెరపీ, శస్త్రచికిత్స పద్ధతులలో సమస్యకు పురోగతి ఉంటుంది. అవయవాలను రక్షించే శస్త్రచికిత్సలు ఇప్పుడు 95% ఎక్స్‌ట్రిమిటీ సార్కోమా కేసులలో చేస్తున్నారు. ఇది చాలా మంది రోగులలో శస్త్రచికిత్స అవసరాన్ని భర్తీ చేస్తుంది." అని డాక్టర్ నందన్ తెలిపారు. చికిత్స అనేది వ్యక్తి పరిస్థితులు, ఇతర కారణాలపై డిపెండ్ అయి ఉంటుంది. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్, కొన్ని సందర్భాల్లో బాగా పెరిగే కణితుల కోసం క్రయోసర్జరీని కూడా చేస్తూ ఉంటారు.
"ప్రారంభంలోనే రోగ నిర్ధారణ చేస్తే.. చికిత్సలో సమర్థవంతమైన ఫలితాలు చూడవచ్చని తెలిపారు. విభిన్నమైన చికిత్స విధానాలు ఉన్నాయి. మెటాస్టాసిస్ లేదా పునరావృతం కోసం పర్యవేక్షించడానికి సాధారణ ఫాలో-అప్‌లు అవసరం." అని వెల్లడించారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















