దెయ్యాలను నమ్మే దేశాలివే - అక్కడైతే చదువుకున్నవారు కూడా చేతబడులు చేస్తారట!
మనదేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా 21వ శతాబ్దంలో కూడా చేతబడి, మంత్రం, తంత్రం, భూత ప్రేతాలు, ఆత్మలు, పునర్జన్మల వంటి వాటి గురించిన విశ్వాసలతో దాదాపుగా 40 శాతం మంది జనాభా ఉన్నారట.
సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన కాలం, పరిశోధన, ఆవిష్కరణలతో దూసుకెళ్తోన్న ఈ యుగంలో దెయ్యాలు గురించి మాట్లాడటం కాస్త హాస్యస్పదంగానే ఉంటుందట. కానీ ఇప్పటికీ ఇంకా చేతబడి, దెయ్యాలు, ఆత్మలు, పునర్జన్మలను నమ్మేవారు, భయపడేవారు ఇంకా చాలా మందే ఉన్నారు. మనదేశంలో భూతవైద్యం, మంత్ర విద్య వంటివి నేర్పిస్తామని చెప్పే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది భూతవైద్యులుగా చలామణి అయ్యేవారు ఉన్నారు. అయితే నిజంగానే దయ్యాలు ఉన్నాయా?
క్రీస్తు శకం 1450, 1750 కాలంలో దెయ్యాలు, ఆత్మలు, మంత్రగత్తెల ప్రాభవం చాలా ఉండేది. ఊర్లో ఏదైనా వ్యాధి వ్యాపించి, మరణాలు జరిగినా, పంటలు పండకపోయినా, పశువులు మరణించినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా దానికి దయ్యులో లేక మంత్రగత్తెలే కారణమని అనేవారు. మధ్యయుగ కాలంలో, యూరప్ నుంచి అమెరికా వరకు దెయ్యాలు, మంత్రగత్తెల గురించి జనం చాలా నమ్మే వారు. వీటి బారిన పడేవారు ఎక్కువగా మహిళలే. మంత్రగత్తెలనే పేరుతో వేధింపులకు గురయ్యే వారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ అడపా దడపా కనిపిస్తూనే ఉంటాయి.
దెయ్యాలు, ఆత్మలు నిజంగా ఉన్నాయా?
భయం సంగతి పక్కన పెడితే నిజంగా దెయ్యాలు, ఆత్మలు నిజంగా ఉన్నాయా? సైన్స్ ఆధారం చేసుకుని చర్చిస్తే కనిపించని వాటిని ఎలా అంగీకరిస్తామని ప్రశ్నిస్తారు హేతువాదులు. మరి దేనికి జనం భయపడుతున్నారు. ఇవ్వన్నీ మూఢనమ్మకాలేనా? ఈ నమ్మకాల వెనుక వివిధ దేశాల్లో సాంస్కృతిక, సామాజిక, మానసిక, ఆర్థిక కారణాలు ఉండవచ్చు.
ఆత్మల గురించి మతం ఏమి చెబుతోంది?
దెయ్యాలు, ఆత్మల గురించిన నమ్మకాలు ఈ నాటివి కావు. తరతరాలుగా మనసుల్లో పాతుకుపోయింది. ఇది అలా ఇప్పటికీ కొనసాగుతున్న వాదన. సనాతన ధర్మం ప్రకారం దెయ్యాలు, ఆత్మలను అతీంద్రియ జీవులుగా అభివర్ణించారు. మరణించిన వ్యక్తి ఆత్మనుంచి ఉద్భవిస్తాయి. మరణించిన వ్యక్తి కోరికలు తీరకపోతే అతడు పునర్జన్మ కోసం ఊర్ధ్వలోకాలకు వెళ్ళలేడు. ఫలితంగా ప్రేతాత్మగా తిరుగుతుంటాడని నమ్మకం. మరోవైపు అకాల మరణం లేదా హత్యలు, తప్పనిసరై ఆత్మహత్యలు చేసుకున్న వారి మరణానంతరం ప్రేతాత్మలుగా మారుతారని ఒక వాదన.
అస్సాంలోని మయోంగ్ గ్రామం నుంచి వారణాసిలోని అనేక ఘాట్ ల వరకు చాలా చోట్ల క్షుద్ర పూజలు జరుగుతాయని తెలిస్తే అవాక్కవక తప్పదు. అందుకే భారతదేశంలో మూఢనమ్మకాలు ఎక్కువ అనే వాదన కూడా ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇలా దెయ్యాలు, ఆత్మలను విపరీతంగా నమ్మే దేశాలు చాలానే ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
కాటెమాకో, మెక్సికో
మెక్సికోలోని కాటెమాకో అందమైన నగరం. చుట్టూ జలపాతాలు, బీచ్ లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ నగరం అందచందాల కంటే కూడా ఈ నగరం బ్లాక్ మ్యాజిక్ కి చాలా ప్రసిద్ధి చెందింది. చాలా మంది మంత్రగాళ్లు ఉంటారని అంటారు. సంవత్సరం పొడవునా క్షుద్ర సాధన జరుగుతుందట ఇక్కడ. అంతేకాదు చాలా చదువుకున్న మంచి పదవుల్లో ఉన్న వారు కూడా చేతబడులు చేస్తారట.
న్యూఓర్లిన్స్ యూఎస్ ఏ
న్యూఓర్లిన్స్ అమెరికాలో బ్లాక్ మ్యాజిక్ సెంటర్ గా చెప్పవచ్చు. పూర్వకాలం నుంచి మేరీ లావే అనే ఆవిడ ప్రముఖ మంత్రగత్తె గా ప్రఖ్యాతి గాంచింది. ఇప్పటికీ ఆమెను గొప్ప మాంత్రికురాలిగా భావిస్తారు. కనుక ఆమె సమాధి పై X అని రాస్తుంటారు.
హార్జ్ పర్వతాలు, ఉత్తర జర్మనీ
ఉత్తర జర్మనీలోని హార్జ్ పర్వతాల ఎత్తైన శిఖరం బ్లాక్ మ్యాజిక్ కు ప్రసిద్ది చెందింది. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కి సాక్సన్ అనే దైవాన్ని ఆరాధిస్తారు.
ఫిలిప్పిన్స్
ఫిలిప్పిన్స్ నగరం బ్లాక్ మ్యాజిక్ కు చాలా ప్రసిద్ది. ఇక్కడ మంత్ర సాధన మంచీ చెడులు రెండింటికి చేస్తారు. ఈ దేశంలో క్షుద్ర కర్మలను కులం అంటారు. ఈ సాధన చేసే వారిని మంక్కుకులం అంటారు. మంక్కుకులం అంటే మంత్రగాడు అని అర్థం. వీరంతా కూడా శత్రువులకు హాని చెయ్యడానికి మంత్ర విద్య అభ్యసిస్తారు. ఇక్కడ క్షుద్ర పూజలను బొమ్మలతో చేస్తుంటారు.
Also read : ఇంట్లో ఈ దిక్కున పితృదేవతలుంటారు: వాస్తు ప్రకారం పాటించాల్సిన జాగ్రత్తలు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.