Black Friday : బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి? ఇది Good or Bad? భారీ డిస్కౌంట్లు ఎందుకిస్తారంటే
Black Friday Sale : దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలప్పుడు సేల్స్ వస్తాయి. కానీ బ్లాక్ ఫ్రైడే పేరుతో ఈ-కామర్స్ సైట్లు డిస్కౌంట్లు ఇస్తాయి. అసలు ఈ బ్లాక్ ఫ్రైడే ఏంటి?

Black Friday 2025 : టీవీల నుంచి OTT, సోషల్ మీడియా వరకు అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్ ఫ్రైడే గురించిన యాడ్స్ చూసే ఉంటారు. బ్లాక్ ఫ్రైడే సేల్ వచ్చేసింది.. ఆ వస్తువులపై, దుస్తులపై భారీ డిస్కౌంట్లు అని తెగ చెప్తూ ఉంటారు. దాదాపు ప్రతి ఇ-కామర్స్ వెబ్‌సైట్ బ్లాక్ ఫ్రైడే పేరుతో భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇదేమన్నా దసరా, దీపావళినా? కస్టమర్‌లకు ఈ రేంజ్లో డిస్కౌంట్ ఆఫర్‌లు ఇవ్వడానికి..? మరి బ్లాక్ ఫ్రైడే సేల్ ఏంటి? అసలు దీనికి ఆ పేరు పెట్టారు? ఈ స్పెషల్ డే గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి? (What Is Black Friday?)
బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం అమెరికాలోనే ప్రారంభమైంది. అక్కడ ఈ రోజును ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఓ రకంగా దీనిని థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఈ విధంగా చూస్తే.. ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే నవంబర్ 28వ తేదీన వచ్చింది. ఈరోజు నుంచే క్రిస్మస్ షాపింగ్ మొదలవుతుందని వారు నమ్ముతారు. ఈ అవకాశాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవడానికి షాపింగ్ సైట్‌లు భారీ డిస్కౌంట్‌లను అందిస్తాయి.
మొదట్లో బ్లాక్ ఫ్రైడేను అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇతర దేశాలలో కూడా దీని క్రేజ్ పెరిగింది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఈ క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకే దీనిని ఇతర దేశాలలో కూడా జరుపుకోవడం ప్రారంభించారు.
బ్లాక్ ఫ్రైడే పేరు ఎలా వచ్చిందంటే..
బ్లాక్ ఫ్రైడే అనే పేరు వినగానే ఇది చెడు లేదా దురదృష్టకరమైన రోజుగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఆఫర్‌లు, భారీ డిస్కౌంట్‌లను చూస్తే అలా అనిపించదు. కానీ ఈపేరు పెట్టినప్పుడు.. నిజంగానే దీనిని బ్లాక్ డేగా భావించి పెట్టారట. వాస్తవానికి బ్లాక్ ఫ్రైడే క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి గుర్తుగా చెప్తారు. దానికి సంబంధించిన షాపింగ్ చేస్తారు. పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో రష్ ఎక్కువగా ఉంటుంది. నగర వ్యవస్థను అదుపులో ఉంచేందుకు పోలీసులను బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. అరవైల నుంచి డెబ్బైల మధ్య ఫిలడెల్ఫియా పోలీసులు దీనిని బ్లాక్ ఫ్రైడే అని పిలవడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సమయంలో అందరూ తమ ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. కానీ తమ కుటుంబాలను విడిచిపెట్టి డ్యూటీల్లో పాల్గొనవలసి ఉంటుంది. అందుకే దీనిని బ్లాక్ ఫ్రైడే అని పిలవడం ప్రారంభించారు. అదే ఇప్పటికీ కంటిన్యూ అయింది.
పేరు మార్చడానికి ప్రయత్నం
దీనిని ప్రతికూలంగా భావించి.. బ్లాక్ ఫ్రైడేను బిగ్ ఫ్రైడేగా మార్చడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ బ్లాక్ ఫ్రైడే అనే పేరు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిని బ్లాక్ ఫ్రైడే అని పిలుస్తున్నారు. దీనిని కొనసాగించడానికి అమెరికా మార్కెట్‌లలో చాలా ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు పెడతారు. దీనిని అనుసరిస్తూ అనేక దేశాలలో ఆన్‌లైన్ షాపింగ్ అందించే వెబ్‌సైట్‌లు దీనిని బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో ప్రచారం చేయడం ప్రారంభించాయి. భారీ డిస్కౌంట్‌లపై షాపింగ్ అందిస్తున్నాయి. ఇండియాలో కూడా ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.






















