Sinus: మందులు వాడకుండానే సైనస్ సమస్యని ఇలా తగ్గించుకోవచ్చు
వాతావరణం కాస్త చల్లబడినా, దుమ్ము ముక్కులోకి వెళ్ళినా సైనస్ సమస్య ఉన్న వాళ్ళకి ఇక నరకమే.
సైనస్ ఇన్ఫెక్షన్ సాధారణ జలుబుతో సమానంగా ఉన్నప్పటికీ ఇది ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుంది. దీర్ఘకాలిక సైనసైటిస్ లక్షణాలు 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. నుదురు, బుగ్గలు, ముక్కులో సైనస్ కణాలు ఉంటాయి. సాధారణ జలుబు వస్తే ముక్కు కారటం, కొన్ని సార్లు జ్వరం ఇతర లక్షణాలు కలిగిస్తాయి. బ్యాక్టీరియా, అలర్జీ, దుమ్ము కూడా సైనసైటిస్ కి కారణమవుతాయి.
సైనసైటిస్ చికిత్స
ఆరోగ్య నిపుణుల ప్రకారం సైనస్ ఇన్ఫెక్షన్లు దాదాపు వాటంతట అవే నయమవుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం వైద్యులు యాంటీ బయాటిక్స్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. అయితే మందులు కాకుండా ఇంట్లోనే సింపుల్ గా సైనసైటిస్ సమస్య తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి.
నీరు తాగాలి
సైనస్ ఇన్ఫెక్షన్ బయటకి వెళ్ళడానికి నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేట్ చేయడం మంచిది. ప్రతి రెండు గంటలకు ఒకసారి 8-10 గ్లాసుల నీటిని తాగాలని సిఫార్సు చేస్తున్నారు.
సహజ నూనెలు
యూకలిప్టస్ వంటి సహజ నూనెలు సైనస్ లు తెరవడానికి, శ్లేష్మం నుంచి బయట పడటానికి సహాయపడతాయి. యూకలిప్టస్ ఆయిల్ లోని సినియోల్ తీవ్రమైన సైనసైటిస్ తో బాధపడుతున్న వ్యక్తులు వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుందని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. త్వరిత ఉపశమనం కోసం ఛాతీపై నూనె రాయడం, వేడి నీటి ఆవిరి పీల్చడం చేస్తే రిలీఫ్ గా ఉంటుంది.
సెలైన్ నాసల్ స్ప్రే
ఒత్తిడి తగ్గించడానికి సైనస్ లు హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. అలా ఉండాలంటే రాత్రి పూట ముక్కు బిగుసుపోకుండా ఉండేందుకు బెడ్ రూమ్ లో హ్యూమిడిఫైయర్ పెట్టుకోవడం మంచిది. అలాగే సహజమైన సెలైన్ నాసల్ స్ప్రే ఉపయోగించాలి. ఇంట్లోనే తయారు చేసుకున్న వాటిని ఉపయోగించడం మంచిది. సైనస్ క్లియర్ చేసుకోవడానికి వేడి నీటి ఆవిరి పట్టడం చేస్తే బాగుంటుంది.
వేడి కంప్రెస్
వెచ్చని కంప్రెస్ సైనసైటిస్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడానికి, నాసికా అడ్డంకులను క్లియర్ చేసుకోవడానికి ముక్కు, బుగ్గల చుట్టూ వెచ్చని టవల్ లేదా హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు.
విశ్రాంతి
సైనస్ వల్ల జ్వరం వస్తే బాగా విశ్రాంతి తీసుకోవాలి. తగినంత రెస్ట్ ఉన్నప్పుడే త్వరగా కోలుకుంటారు.
చికెన్ సూప్
కొన్ని అధ్యయనాల ప్రకారం చికెన్ సూప్ సైనస్ ఇబ్బందులను తొలగిస్తుంది. జలుబు వల్ల వచ్చే వాపుని కూడా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వైరస్ తో పోరాడటానికి రోజువారీ భోజనంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి యాంటీ బ్యాక్టీరియల్ ఆహారాలు చేర్చుకోవడం మంచిది. అలాగే హెర్బల్ టీ తాగాలి.
ఇవి వద్దు
సైనసైటిస్ తీవ్రతరం చేసే ఆల్కహాల్, స్విమ్మింగ్, డైవింగ్, ఫ్లైయింగ్ వంటివి చేయకపోవడమే మంచిది. ఇవి సమస్యను మరింత పెంచుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.