Protein Powder: మహిళలను స్ట్రాంగ్‌గా ఉంచే ప్రోటీన్ పొడి - ఉత్తమైనవి ఎలా ఎంచుకోవాలంటే
ఇప్పుడు ప్రోటీన్ పొడి తీసుకోవడం ఫ్యాషన్ అయిపోతుంది. వాటిని తీసుకుంటే బలంగా ఉంటారని నమ్ముతారు.
ఇల్లు, ఆఫీసు పనుల్లో నిమగ్నమవుతూ మహిళలు ఆరోగ్యం మీద కాస్త అశ్రద్ధ వహిస్తారు. టైమ్ కి తినకపోవడం వల్ల ప్రోటీన్ తగినంతగా లభించదు. దాన్ని అధిగమనించేందుకు ప్రోటీన్ పౌడర్ మీద ఆధారపడుతున్నారు. అథ్లెట్లు, జిమ్ చేసే వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ పౌడర్ మీద ఆసక్తి చూపిస్తారు. వ్యాయామం చేసిన వెంటనే ప్రోటీన్ షేక్ తీసుకుంటారు. కండరాల పెరుగుదల, శరీరాక పనితీరు కోసం వీటిని ఎంచుకుంటారు. మహిళలు స్ట్రాంగ్ గా ఉండేందుకు అవసరమైన కొన్ని ప్రోటీన్ పౌడర్ల జాబితాలు ఇవి. పాలలో హార్లిక్స్ మాదిరిగా ప్రోటీన్ పొడి కూడా కలుపుకుని తాగేయవచ్చు. స్మూతీస్ లోనూ కలుపుకుని తీసుకోవచ్చు.
వెయ్ ప్రోటీన్
పాల విరుగుడు నుంచి చేసే ప్రోటీన్ పౌడర్ ఇది. పోస్ట్ వర్కౌట్ తర్వాత కండరాల పెరుగుదలకి ఇది దోహదపడుతుంది. శరీరానికి కావాల్సిన అన్ని అమైనో ఆమ్లాలు అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.
సోయా ప్రోటీన్
సోయా బీన్స్ నుంచి తయారు చేసేది సోయా ప్రోటీన్. శాఖాహారులకి ఇది ఉత్తమ ఎంపిక. అమైనో ఆమ్లాలు, ఫైటో కెమికల్స్ శరీరానికి అందిస్తుంది.
బఠానీల ప్రోటీన్
పసుపు రంగు బఠానీల నుంచి వచ్చేది ఈ బఠానీ ప్రోటీన్ పౌడర్. పూర్తిగా మొక్కల ఆధారిత ప్రోటీన్. జీర్ణం చేయడం సులభం. హైపోఅలర్జెనిక్, లాక్టోస్ అసహనం ఉన్న వాళ్ళు, పాల అలర్జీ ఉన్న వారికి ఇది మంచి ఎంపిక.
జనపనార ప్రోటీన్
ఇది పూర్తిగా జనపనార విత్తనాల నుంచి తీసుకోబడుతుంది. ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్ కోసం చూసే వారికి ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం.
బియ్యం ప్రోటీన్
బ్రౌన్ రైస్ నుంచి సేకరించిన రైస్ ప్రోటీన్ ఇది. హైపోఅలెర్జినిక్ సమస్య ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సులభంగా జీర్ణమవుతుంది. ఇది పూర్తి ప్రోటీన్ కానప్పటికీ అమైనో ఆమ్లాలు ఉన్నాయి.
కొల్లాజెన్ ప్రోటీన్
కొల్లాజెన్ అనే ప్రోటీన్ చర్మం, ఎముకల కణజాలాల్లో ఉంటుంది. జుట్టు పెరుగుదల, చర్మ స్థితిస్థాపకత, కీళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. కొల్లాజెన్ ప్రోటీన్ పొడి ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతోంది.
ఉత్తమ ప్రోటీన్ పౌడర్ ఎలా ఎంచుకోవాలి?
⦿ మీకు ఇష్టమైన ప్రోటీన్ రకాన్ని ఎంచుకోవడం కీలకం.
⦿ శాఖాహారి లేదా పాల రహిత ఆహారం తీసుకునే వ్యక్తులు బఠానీలు, బ్రౌన్ రైస్ లేదా చియా గింజలు వంటి పదార్థాల నుంచి తీసుకునే మొక్కల ఆధారిత పొడి ఎంచుకోవాలి.
⦿ స్మూతీస్, ప్రోటీన్ డ్రింక్స్ లేదా కాల్చిన వస్తువులు వంటి వాటిని ఉపయోగించాలని అనుకున్నప్పుడు వాటికి సరిపడా రుచులు ఎంచుకోవడం ముఖ్యం.
⦿ ప్రొ బయోటిక్స్, విటమిన్ బి, ఐరన్ వంటివి ఉన్నవి మహిళలు ప్రత్యేకంగా ఎంచుకోవాలి.
⦿ చక్కెర, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఏమేం ఉన్నాయో లేబుల్ మీద జాగ్రత్తగా చూసుకుని కొనుగోలు చేసుకోవాలి.
⦿ ఉత్పత్తులకి ఎన్ఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ లేదా ఇన్ ఫారమేడ్ ఛాయిస్ వంటి థర్డ్ పార్టీ వారి లేబుల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి.
బయట కొనుగోలు చేసుకునే ప్రోటీన్ పొడి కంటే ఇంట్లో దొరికే వాటితో చేసుకుంటే మంచిది. సహజ పద్రతాలు ఉపయోగించి ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. బాదం, జీడిపప్పు, ఖర్జూరం లేదా తేనెతో కలిపిన వాల్ నట్స్ వంటివి ఉపయోగించి పొడి తయారు చేసుకుంటే మంచిది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లని అందిస్తుంది.
⦿ గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు, చియా గింజలు, వంటి విత్తనాల నుంచి తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ లో ప్రోటీన్, ఫైబర్, కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. క్వినోవాతో కూడా పొడి తయారు చేసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: భారీగా పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు- ఈ అలవాట్లే ప్రధాన కారణం