Bone Density: ఎముకల ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరిగా తినాల్సిందే
ఎముకలు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదంటే అవి పెళుసుగా మారి బోలు ఎముకల వ్యాధి బారిన పడిపోతారు.
శరీర నిర్మాణానికి ఎముకలు బ్లూ ప్రింట్ లాంటివి. అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా తీసుకునే శ్రద్ధ కంటే ఎముకల విషయంలో మరింత ఎక్కువ అవసరం. ఎముకలు ధృడంగా ఉండాలంటే కాల్షియం అవసరం. ముఖ్యంగా మహిళలకు ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. మెనోపాజ్ దశకు వచ్చిన తర్వాత మహిళల ఎముకలు బలం కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పెద్దలు తమ ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడానికి రోజుకి కనీసం 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. శరీరంలోకి కాల్షియం శోషణకు మెగ్నీషియం, విటమిన్ ఏ, డి వంటి ఇతర పోషకాలు కూడ అవసరం. ఎముకలు పేలవంగా ఉంటే బోలు ఎముకల వ్యాధి పరిస్థితికి కారణమవుతుంది. పట్టించుకోకుండా వదిలేస్తే ఎముకలు విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆరోగ్యకరమైన ఎముకలకు పాలు ఒక్కటే పరిష్కారం కాదు. రోజువారీ ఆహారం ద్వారా తగినంత కాల్షియం అందించడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కావలసినంత కాల్షియం అందుతుంది. కానీ వీటిని మాత్రమే కాదు ఇతర ఆహారాలు కూడా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
శరీరానికి బలం చేకూర్చే ఆహారం
⦿రోజూ 6 క్యారెట్లు, 50 గ్రాముల బచ్చలికూర వేసుకుని జ్యూస్ గా చేసుకుని ఒక గ్లాసు తాగితే మంచిది. ఇది సుమారు 300 మిల్లీగ్రాముల కాల్షియంను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.
⦿రాజ్మా, కాబూలీ చనా, బ్లాక్ దాల్, కులీట్ వంటి పప్పుల ద్వారా కూడా కాల్షియం పొందవచ్చు. వీటిలో 100 గ్రాముల పచ్చి పప్పులో 200 నుంచి 250 గ్రాముల కాల్షియం లభిస్తుంది.
⦿ప్రతిరోజు 2-3 టేబుల్ స్పూన్ల తెల్ల లేదా నల్ల నువ్వులు తింటే శరీరానికి కావలసిన కాల్షియం పొందుతారు.
⦿బచ్చలికూర, కాలే, బ్రకోలి వంటి ఆకుపచ్చని ఆకు కూరల్లో ఫైబర్, విటమిన్లు, ఐరన్ కలిగి ఉన్నందున ఎముకలకు చాలా మంచిది. తగినంత ప్రోటీన్లను తీసుకోవడం కూడా చాలా అవసరం. కాయలు, గుడ్లు, చిక్కుళ్ళు, కాయ ధాన్యాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
⦿సిట్రస్ పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి తప్పనిసరిగా మీ భోజనంలో ఉండేలా చూసుకోవాలి. బెర్రీలు, నారింజ, ద్రాక్షలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఎముకలకు నష్టం కలిగించే ఆహారాలు
⦿అధిక సోడియం ఆహారాలు
⦿చక్కెర అధికంగా ఉండే స్నాక్స్
కార్బొనేటెడ్ డ్రింక్స్: శరీరానికి హాని చేసే కార్బోనేటెడ్ డ్రింక్స్ లో చక్కెర, కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను బలహీనంగా మార్చే ఆమ్లాన్ని కలిగి ఉంటాయి.
⦿ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం చాలా మంది జంతు ప్రోటీన్లు అధికంగా తీసుకుంటారు. కానీ వాటిని తీసుకోవడం మంచిది కాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
⦿అధిక కెఫీన్ కంటెంట్ ఉండే టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల ఎముకల నుంచి కాల్షియం కోల్పోవడానికి దారి తీస్తుంది.
⦿ధూమపానం, పొగాకు వినియోగం కూడా కాల్షియం క్షీణతకు కారణమవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.