Clay Pot: మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి
మట్టి కుండలో వంటలు చేయడం మళ్ళీ మొదలైంది. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
పూర్వం మట్టి కుండలోనే వంట చేసేవారు. కాలం మారుతున్న కొద్దీ ఆ ఆచారం కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య స్పృహ పెరుగుతుండడంతో, మట్టి కుండల వాడకం నెమ్మదిగా ఎక్కువైంది. ఆహారాన్ని వండడానికి మట్టికుండలను ఉపయోగించడం అనేది నిజంగా ఒక సురక్షితమైన పద్ధతి. మట్టిపాత్రలు పోరస్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల ఆహారం ద్వారా తేమ, వేడి రెండూ ప్రసరించడానికి అనుమతినిస్తుంది.ఈ లక్షణం ఆహారాన్ని నెమ్మదిగా సమానంగా ఉడికేలా చేస్తుంది. ఫలితంగా మంచి రుచితో పాటు పోషకాలు కూడా బయటకి పోకుండా ఉంటాయి. అలాగే మట్టి కుండలో ఉండడానికి ఎక్కువ నూనె అవసరం లేదు కాబట్టి భోజనం ఆరోగ్యకరంగా ఉంటుంది. మట్టికుండల్లో హానికరమైన రసాయనాలు ఏమీ ఉండవు. వీలైనంతవరకు వీటిని వాడడం మంచిది. అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
పాత్ర నానబెట్టడం
మట్టికుండను మొదటిసారి ఉపయోగించేముందు దానిని నీటితో నింపి కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పగుళ్లు రాకుండా ఉంటాయి. కుండ నానబెట్టాక దానిని వస్త్రంతో తుడవాలి. మళ్లీ నీటితో నింపి తక్కువ మంట మీద ఉంచాలి. ఇలా రెండు నిమిషాలు పాటు ఉడికించాలి. అప్పుడు ఆ నీటిని పడేయాలి. ఇక ఆ కుండ వంట చేయడానికి పూర్తిగా సన్నద్ధమైనట్టే.
తక్కువ మంటతో
మనం సాధారణంగా స్టీల్ గిన్నెలు, నాన్ స్టిక్ పాన్ల మీద వండేటప్పుడు పెద్ద మంట మీద ఉడికిస్తాం. కానీ మట్టి కుండల మీద వండేటప్పుడు చిన్న మంట మీద వండాలి. అధిక వేడిని, అధిక మంటను అవి తట్టుకోలేకపోవచ్చు. అందువల్ల మంట తక్కువగా ఉండేలా ఎల్లప్పుడూ చూసుకోండి. తక్కువ మంట మీద వండడం వల్ల ఆహారం నెమ్మదిగా ఉడుకుతుంది. అలాగే ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది.
చెక్క గరిటె
మట్టి పాత్రలో ఆహారాన్ని కలపడానికి స్టీలు గరిటెలు ఉపయోగించకూడదు. అడుగు భాగం దెబ్బతింటుంది. మట్టి కుండల కోసం చెక్క గరిటెలను, సిలికాన్‌తో చేసిన గరిటెలను వాడవచ్చు. అవి అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటాయి. మట్టికుండల అడుగుభాగాన ఎలాంటి గీతలు పడవు.
ఇలా శుభ్రం చేయొచ్చు
మట్టికుండ పై కంటికి కనిపించని దుమ్మూ, ధూళి పేరుకు పోయే అవకాశం ఉంది. దాన్ని త్వరగా శుభ్రం చేయాలంటే చిన్న పద్ధతి ఉంది. రెండు మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని కుండ లోపల గోడలపై రుద్దండి. తర్వాత కుండను తిప్పి ఆ పిండిని కింద పడేలా పైభాగాన్ని కొట్టండి. పిండితోపాటు మట్టి కణాలు, దుమ్ము వంటివి పడిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉంచండి. తర్వాత స్టవ్ కట్టేయండి. కాటన్ వస్త్రంతో కుండ లోపల భాగాన్ని తుడవండి. గోధుమ పిండితో పాటు దుమ్ము ధూళి ఇతర కణాలు కూడా రాలిపోతాయి.
సున్నితమైన స్క్రబర్
ఇతర గిన్నెలను తోమినట్టు ఈ మట్టి కుండను బరబరా తోమడానికి వీలుకాదు. సున్నితమైన మెత్తని స్క్రబ్బర్‌తో మెల్లగా తోమాలి. తర్వాత కాటన్ క్లాత్ తో తుడిచేయాలి. గాలికి ఆరబెట్టాలి లేదా సూర్యకాంతిలో ఉంచినా మంచిదే. మట్టికుండను సూర్యకాంతిలో ఆరబెట్టడం వల్ల దాని నుంచి తేమ త్వరగా తొలగిపోతుంది.
Also read: డయాబెటిస్ రోగులకు ఉత్తమమైన పిండి రకాలు ఇవే, వీటి వల్ల రక్తంలో చక్కెర పెరగదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.