Coronavirus: ఓ మై గాడ్, కోవిడ్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందా?
కరోనా వల్ల ఇప్పటికే ఊపిరితిత్తులు దెబ్బతినడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా పురుషుల్లో సంతాన సామర్థ్యం కూడా తగ్గిపోతుందని అంటున్నారు.
కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ 11 రకాల వేరియంట్లని గుర్తించారు. అమెరికాలో భారీగా కేసులు నమోదవుతున్న కొత్త వేరియంట్ XBB.1.5 వేరియంట్ కేసులు భారత్ లోనూ వస్తూ కలవరపెడుతున్నాయి. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఎయిమ్స్‌కు చెందిన ఒక అధ్యయనం షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. కోవిడ్ సోకిన పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందని ఎయిమ్స్ పరిశోధన పేర్కొంది.
అధ్యయనం ఏం చెబుతోంది?
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని పరిశోధకులు 30 మంది పురుషులపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం SARS-CoV-2 వైరస్‌ల వల్ల వీర్యం నాణ్యత దెబ్బతింటుందని గుర్తించారు. వృషణ కణజాలంలో పుష్కలంగా ఉండే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్-2 రిసెప్టర్ (ACE2) ద్వారా కోవిడ్ ఇతర అవయవాలకి నష్టం కలిగిస్తుందని పాట్నాలోని ఎయిమ్స్ పరిశోధకుల నేతృత్వంలోని బృందం పేర్కొంది.
పరిశోధకులు వీర్యం నాణ్యత, స్పెర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్‌పై వ్యాధి ప్రభావాన్ని విశ్లేషించారు. కోవిడ్ సోకిన వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా నాణ్యత లేకుండా ఉన్నట్లు బృందం గుర్తించింది. సంతానోత్పత్తి సామర్థ్యంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్టోబర్, 2020 నుంచి ఏప్రిల్ 2021 మధ్య ఎయిమ్స్ పరిశోధన బృందం 19-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 30 మంది కోవిడ్ రోగులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
కోవిడ్ సోకిన తర్వాత వారి దగ్గర నుంచి మొదటి నమూనా తీసుకుని పరీక్షలు జరిపారు. 74 రోజుల తర్వాత రెండవసారి RT-PCR పరీక్షలు జరిపారు. అందులో వీర్యంలో కోవిడ్ ప్రతికూల ప్రభావాలు కనుగొన్నారు. మొదటి సారి పరీక్షించినప్పుడు వీర్య పరిమాణం, కౌంట్ గణనీయంగా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. తర్వాత జరిపిన పరీక్షల్లో వీర్యం నాణ్యత తగ్గడం, తెల్ల రక్తకణాలు పెరగడం గమనించారు. అయితే స్పెర్మ్ లో వాళ్ళు ఎటువంటి SARS-CoV-2ని కనుగొనలేకపోయారు. కానీ కోవిడ్ వల్ల మాత్రం స్పెర్మ్ కౌంట్ తగ్గడం ఆందోళన కలిగించే అంశం అని పేర్కొన్నారు.
ఇప్పటికే కరోనా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటునట్లు తేలింది. కరోనా వచ్చిన తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరిగినట్లు ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. కరోనా తీవ్రంగా వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లోని కణాలు దెబ్బతినవచ్చు. ఆ దెబ్బతిన్న కణాలు కుళ్ళి క్యాన్సర్ కణాలుగా మారవచ్చు.
ఈ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి?
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలలో కనిపించే ప్రధాన లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
1. దీర్ఘకాలిక దగ్గు
2. దగ్గినప్పుడు రక్తం కనిపించడం
3. శ్వాస సరిగా ఆడకపోవడం
4. ఛాతి నొప్పి
5. గొంతులో బొంగురుతనం
6. బరువు తగ్గడం
7. ఎముక నొప్పి
8. తలనొప్పి ఎక్కువగా రావడం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: రోజుకు మూడు వాల్ నట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?