Oats Masala Vada : హెల్తీ, టేస్టీ ఓట్స్ మసాలా వడల రెసిపీ.. ఇలా చేస్తే నూనెను పీల్చుకోవండోయ్
Masala Vada Recipe : టేస్టీ, హెల్తీ మరీ ముఖ్యంగా నూనె అస్సలు పీల్చని హెల్తీ వడలు చేసుకోవాలనుకుంటే ఇక్కడో సూపర్ రెసిపీ ఉంది. పైగా దీనిని చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు.
Tasty Oats Masala Vada Recipe : ఉదయాన్నే లేదా సాయంత్రం ఓట్స్‌తో మీరు మంచి హెల్తీ, టేస్టీ ఫుడ్ తినాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఓట్స్ మాసాల వడను ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఓట్స్‌ని ఆరోగ్యకరమైన విధానంలోనే ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల టేస్టీ ఫుడ్ మీదకి ఎక్కువ మనసు వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లకుండా.. ఓట్స్తోనే టేస్టీ రెసిపీ చేసుకుగలిగితే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతమవుతుంది. అయ్యే ఇప్పుడు వడలు అంటే ఎక్కువ టైమ్ పడుతుంది.. నూనె పడుతుంది అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే దీనిని చాలా తక్కువ టైమ్‌లో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పైగా ఇవి నూనెను అస్సలు పీల్చుకోవు. మరి ఈ హెల్తీ, టేస్టీ ఓట్స్ మసాలా వడలను ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
శనగపప్పు - అరకప్పు
ఓట్స్ - ముప్పావు కప్పు
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - చిన్న కట్ట
ధనియాలు - 1 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కారం - 1 స్పూన్
తయారీ విధానం
ముందుగా శెనగపప్పును నానబెట్టుకోవాలి. కనీసం దీనిని రెండు గంటలు నానబెట్టుకోవాలి. పప్పు నానిన సమయానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను కడిగి.. సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. శెనగపప్పు నానిపోతే.. దానిని కడిగి.. పప్పులను మిక్సీజార్‌లో వేసి మిక్సీ చేయాలి. పూర్తిగా పేస్ట్ చేయకుండా కాస్త బరకగా ఉండేలా చూసుకోవాలి. దీనిలో అస్సలు నీటిని కలుపకూడదు. అయితే కొన్ని శెనగపప్పులు అలాగే ఉండేలా మిక్సీ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని శెనగపప్పులను పక్కనపెట్టి.. మిక్సీ చేసిన తర్వాత పిండిలో కలిపేయవచ్చు. ఇలా చేయడం వల్ల వడల రుచి మరింత పెరుగుతుంది.
ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో శెనగపప్పు మిశ్రమాన్ని తీసుకోవాలి. దానిలో ఓట్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, ధనియాలను కాస్త నలిపి వేయాలి. ఉప్పు కూడా వేసి మిశ్రమం పూర్తిగా కలపాలి. ఇప్పుడు వడ మాదిరి పేస్ట్ వచ్చే వరకు కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ పిండిని కలపాలి. ఈ సమయంలో పిండితో వడను చేయండి. ఆ షేప్ రాకుండా విరిగిపోతుంటే.. మరి కాస్త నీరు వేసుకుంటూ కలపాలి. ఒకేసారి నీటిని వేయకూడదు. పైగా నీరు ఎక్కువైతే.. వడలు నూనెను ఎక్కువ పీల్చుకుంటాంయి.
పిండిని బాగా కలిపిన తర్వాత స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టండి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత పిండిని వడల మాదిరిగా చేసుకుని నూనెలో వేయాలి. వడలు వేసిన వెంటనే గరిటతో తిప్పకూడదు. మీడియం మంట మీద కాస్త ఉడికిన తర్వాత వాటిని మరోవైపు తిప్పి వేయించాలి. ఇలా మిగిలిన పిండితో వడలు చేసుకుని వేయించుకోవాలి. అంతే వేడి వేడి టేస్టీ, హెల్తీ ఓట్స్ మసాలా వడలు రెడీ. వీటిని అల్లం చట్నీతో కలిపి హాయిగా తినొచ్చు. లేదంటే చాయ్‌తో పాటు మంచి హెల్తీ స్నాక్‌గా తీసుకోవచ్చు.
పిల్లలకు ఉదయాన్నే టిఫెన్ బాక్స్‌లో కూడా వీటిని పెట్టవచ్చు. వీటిని కేవలం ఉదయమే కాకుండా సాయంత్రం కూడా హెల్తీ స్నాక్‌గా తీసుకోవచ్చు. ఈ ఓట్స్ మసాలా వడలు పైకి కరకరలాడుతూ.. లోపల మెత్తగా ఉండి.. అద్భుతమైన రుచిని ఇస్తాయి. శెనగపప్పును కాస్త బరకగా ఉంచితే రుచి మరింత ఎక్కువ అవుతుంది. అయితే మీరు శెనగపప్పును ఎక్కువ సేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రెండు గంటలు నానబెడితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని తయారు చేసి మీ ఇంటి సభ్యులకు తినిపించేయండి.
Also Read : తెలంగాణ స్పెషల్ కొబ్బరి వడ.. టేస్టీగా చేసుకోగలిగే ఈజీ రెసిపీ