Viral: భార్య మీద ప్రేమతో మోపెడ్ కొన్న బిచ్చగాడు, ఇప్పుడిద్దరూ మోపెడ్ పై తిరుగుతూ భిక్షాటన చేస్తారట
ఓ బిచ్చగాడు భార్య పడుతున్న కష్టం చూడలేక ఓ మోపెడ్ కొన్నాడు. ఆ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
సంతోష్ సాహు - మున్ని... ఇద్దరు భార్యాభర్తలు. చాలా ఏళ్లుగా భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిద్దరి వయసు యాభై ఏళ్ల పైనే ఉంటుంది. సాహు వికలాంగుడు కావడంతో మూడు చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అతను తనను పోషించ లేని స్థితిలో ఉన్నా కూడా మున్నీ ఏరోజు వదిలి వెళ్లిపోలేదు. ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా జీవిస్తున్నారు. సాహూ మూడు చక్రాల కుర్చీని మున్ని వెనుక నుంచి తోస్తూ రోడ్లపై బిచ్చమెత్తుకుంటారు. అయితే మూడు చక్రాల బండిని తోసి తోసి మున్నీ ఆరోగ్యం పాడైపోతుండడం గమనించాడు సంతోష్. తన భార్య కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. నాలుగేళ్లుగా వారిద్దరూ పొదుపు చేయడం మొదలుపెట్టారు.
ఎంత పొదుపు చేశారంటే...
వీరిద్దరూ కలిసి భిక్షమెత్తితే వారికొచ్చేది రూ.300 నుంచి రూ.400 దాకా ఉంటుంది. ఒక్కోసారి భోజనం ఎవరో ఒకరు పెట్టేస్తారు. కాబట్టి పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. గత నాలుగేళ్ల నుంచి డబ్బులను దాస్తూ వచ్చారు. అలా 90,000 రూపాయలు పోగు చేశారు. ఆ డబ్బులతో మోపెడ్ కొన్నారు. సాహు దివ్యాంగుడు కావడంతో వెనుక అదనం రెండు చిన్న చక్రాలు పెట్టించాడు. ఆ బండిని మున్నీకి బహుమతిగా ఇచ్చాడు. ఇక ఆమెకు మూడు చక్రాల బండిని తోసే అవసరం లేదు. మోపెడ్ పైనే ఎక్కడికైనా వెళుతూ భిచ్చమెత్తుకోవచ్చు. ఒక ఏరియా తరువాత మరో ఏరియాకి వెళ్లడానికి కూడా గతంలో వీరికి చాలా సమయం పట్టేది. వర్షం పడినప్పుడు కూడా వానలో తడుస్తూనే వెళ్లేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇప్పుడు మోపెడ్ పై త్వరగా వెళ్లిపోతామని చెబుతోంది ఈ జంట.
వీరుండేది ఎక్కడో చెప్పలేదు కదూ... మధ్యప్రదేశ్లోని చిండ్వారాలో. ఇప్పుడు వారక్కడ పాపులర్ అయిపోయారు. భార్య మీద ప్రేమతో మోపెడ్ కొన్న బిచ్చగాడిగా సంతోష్ సాహు ఫోటో కూడా వైరల్ అవుతోంది. కాకపోతే అందరికీ ఒకటే సందేహం మోపెడ్ పై వచ్చి భిక్షమెత్తుకుంటే ఎవరైనా చిల్లర వేస్తారా అని. వారిని డబ్బున్న వారిగా భావిస్తారేమో అనే అనుమానం చాలా మందిలో ఉంది. జంట మాత్రం తాము ఇలాగే ప్రయాణం కొనసాగిస్తామని చెబుతోంది. తమ వయసు పెరిగిందని, ఎక్కువ దూరాలు నడవలేమని చెబుతున్నారు.
Also read: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి
Also read: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం