30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..
30 డేస్ వాటర్ ఛాలెంజ్ మీరు చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదం బారిన పడుతున్నట్టే. ఎందుకంటే అధికంగా నీరు తాగడం వల్ల ప్రమాదం కూడా ఉందని మీకు తెలుసా?
సోషల్ మీడియాలో ఏదైనా ఒక కొత్త ఛాలెంజ్ వచ్చిందంటే చాలు అది వైరల్ చెయ్యకుండా వదిలిపెట్టరు. కొన్ని ఛాలెంజ్ లు మంచిగా ఉంటే మరి కొన్ని మాత్రం ప్రమాదకరంగా ఉంటాయి. గ్రీన్ ఇండియా వంటి మంచి ఛాలెంజ్ వస్తే కికి ఛాలెంజ్ వంటి ప్రమాదకరమైనవి కూడా వచ్చాయి. వెళ్తున్న కారులో నుంచి కిందకి దిగి డాన్స్ చెయ్యడం కికి ఛాలెంజ్. అప్పటిలో ఇది చాలా ఫేమస్ అయ్యింది. ఎంతో ప్రమాదకరమైన ఈ ఛాలెంజ్ వల్ల కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పుడు అటువంటిదే మరో ప్రమాదకరమైన ఛాలెంజ్ వచ్చింది. అదే 30 డేస్ వాటర్ ఛాలెంజ్.
ఇంటర్నెట్ లో ప్రతి రోజు ఏదో ఒక పిచ్చి ఛాలెంజ్ రావడం దాన్ని కొంతమంది వెర్రి వాళ్ళు ఫాలో అవడం సదా మామూలే. ఇప్పుడు కూడా చాలా మంది రీల్స్, షార్ట్స్‌లో 30 డేస్ వాటర్ ఛాలెంజ్ చేస్తున్నారు. 30 రోజుల పాటు రోజుకి 4.5 లీటర్ల నీళ్ళు తాగడమే ఈ ఛాలెంజ్. ప్రస్తుతం ఇది విపరీతంగా వైరల్ అయింది. చాలా మంది బాటిల్స్ బాటిల్స్ నీళ్ళు తాగుతూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా నీళ్ళు తాగడం వల్ల శరీరానికి చాలా బాగుందని కొందరు అంటున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా అడికంగా నీళ్ళు తాగడం వల్ల తమ చర్మం మెరిసిపోతుందని, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గాయని చెప్తున్నారు. మరికొందరేమో నీళ్ళు తాగి తాగి మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది బాత్రూమ్ కి వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు.
నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిదే కదా.. మరి ఇది ప్రమాదకరమని ఎందుకు అంటున్నారని ఆలోచిస్తున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం మంచిదని వైద్యులు సూచిస్తారు. శరీరానికి తగినంత నీరు లేకపోతే డీహైడ్రేట్ అవుతారు. దాని వల్ల నీరసం ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. నీటిలో అవసరమైన అన్ని ఖనిజాలు, విటమిన్లు ఉన్నందున సురక్షితమైన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జీవక్రియ, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు బరువు తగ్గించే ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. నీరు ఎక్కువ తాగడం వల్ల హైపర్ హైడ్రేషన్ కి గురవుతాం.
అధికంగా నీరు తాగడం మంచిది కాదా?
రోజుకి మూడు లీటర్లకి మించి నీరు తీసుకోవడం వల్ల అనరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.. నీరు ఎక్కువ తాగడం వల్ల హైపర్ హైడ్రేషన్ కి గురవుతాం. ఓ నివేదిక ప్రకారం నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, గందరగోళం, తలనొప్పి, వికారం, వాంతులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదే కాదు మూర్చలు, మెదడు దెబ్బతినడం, కోమాలోకి వెళ్ళడం వంటివి కూడా ఒక్కోసారి జరగొచ్చు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైపర్ హైడ్రేషన్ వల్ల శరీరం నుంచి అధిక మొత్తంలో ఎలక్ట్రోలైట్‌లను కోల్పోయే అవకాశం ఉంది అందుకే నీరు అధికంగా తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. అందుకే ఇటువంటి ఛాలెంజ్ లు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. లేదంటే మీరు ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది.
Also read: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి