TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించిన టీఎస్ పీఎస్సీ తాజాగా మంగళవారం నాడు మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది.
ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది.
గ్రూప్-1 పరీక్ష విధానం, మార్కుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్యకు 1:50 నిష్పత్తిలో మొత్తం 25,050 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18 నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. కానీ జనవరి 31న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ తేదీలను టీఎస్ పీఎస్సీ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 16న 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో టీఎస్‌పీఎస్సీ తొలిసారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నంబర్ సిరీస్‌తో ప్రశ్నాపత్రం ఇచ్చింది. ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్ పద్ధతిలో జవాబులు అడిగారు. ప్రతిఒక్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానందున మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రిలిమినరీ ‘కీ’ని అక్టోబరు 29న, ఫైనల్ కీని నవంబరు 15న విడుదల చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ విధానం:
➥ 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షల్లో 6 ప్రధాన సబ్జెక్టులతో పాటు జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పరీక్ష ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మిగతా 6 పేపర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని పేపర్ల మూల్యాంకనం చేస్తారు.
➥క్వాలిఫయింగ్ టెస్టు 150 మార్కులకు ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్టు మాత్రమే. ఈ మార్కులను మెయిన్స్ పరీక్షల్లో (6 పేపర్లు) సాధించిన మొత్తం మార్కులలో మాత్రం కలపరు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
➥ మెయిన్స్ పరీక్షల్లో నిర్వహించే మొత్తం 6 పేపర్లలో.. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున 900 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రతి పేపర్‌లో మూడు వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. మూడు సెక్షన్లలలో ప్రతి సెక్షన్ నుండి 1 వ్యాసరూప సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి సమాధానానికి 50 మార్కుల చొప్పున 150 మార్కులు ఉండనున్నాయి. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం ఉంటుంది.
➥ మెయిన్స్ ఎగ్జామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. దానికి 100 మార్కులు కేటాయించేవారు. దీంతో మొత్తం కలిపి 1000 మార్కులకు గ్రూప్-1 పరీక్ష నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఇంటర్వూలు ఎత్తేశారు. దీంతో 900 మార్కులకే గ్రూప్ -1 మెయిన్స్ నిర్వహించనున్నారు.
➥ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపికలో కేవలం ఈ ఆరు పేపర్లలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్, క్వాలిఫయింగ్ ఇంగ్లిష్ పరీక్షలలో సాధించిన మార్కులను ప్రధాన పరీక్షలకు కలపరు.