TSPSC: జులై రెండోవారంలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫలితాలు! మెయిన్స్ పరీక్షలు అప్పుడేనా?
నెలరోజుల్లోపు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే కనీసం మూడు నెలల సమయమిచ్చి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది.
తెలంగాణలో 501 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఒకపక్క పేపర్ లీక్ విచారణ సాగుతున్న సమయంలోనే.. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రిలిమ్స్ పరీక్షను దిగ్విజయంగా నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ ఇక తన దృష్టంతా ప్రిలిమ్స్ మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని త్వరలోనే వెబ్‌సైట్‌లో పొందుపరిచడంపై కేంద్రీకరించింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేసి.. తుది కీ విడుదల, అనంతరం మూల్యాంకనం నిర్వహించి, నెలరోజుల్లోపు ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే కనీసం మూడు నెలల సమయమిచ్చి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది.
అక్టోబరు లేదా నవంబరులో మెయిన్స్..
టీఎస్‌పీఎస్సీ ప్రస్తుతం సెప్టెంబరు నెలాఖరు వరకు ఇతర పోటీ పరీక్షలతో షెడ్యూలు బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరులో గ్రూపు-1 మెయిన్స్ నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు.. రద్దయిన గత పరీక్షతో పోల్చితే దాదాపు 50 వేల మంది వరకు తగ్గారు. వీరిలో పలువురు అభ్యర్థులు గ్రూప్-2, 4 పరీక్షల సన్నద్ధతపై దృష్టిపెట్టినందున ఈ పరీక్షకు దూరంగా ఉన్నారు.
ఉద్యోగులకు నిర్బంధ సెలవుపై పంపి..
ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పలు సంస్కరణలు తీసుకువచ్చింది. కమిషన్ ఉద్యోగులు ఎవరైనా ఆయా పరీక్షలకు హాజరైతే వారిని నిర్బంధ సెలవులో పంపించాలని నిర్ణయించింది. గ్రూప్-1 పునఃపరీక్షకు పది మంది ఉద్యోగులు దరఖాస్తు చేయగా.. వారిని పరీక్ష తేదీకి రెండు నెలల ముందు, పరీక్ష తరువాత నెల రోజుల వరకు ఉద్యోగాలకు సెలవు పెట్టించారు. మిగతా పరీక్షలకు ఇదే పద్ధతి అవలంబించాలని కమిషన్ నిర్ణయించింది. నిర్బంధ సెలవులోకి సిబ్బంది వెళ్లడంతో ఇతర ఉద్యోగులు అదనపు గంటలు పనిచేస్తున్నారు. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగగా.. జూన్ 12న తెల్లవారుజాము 3 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించారు.
ఆ వార్తలు అవాస్తవం..
జక్కుల సుచరిత అనే అభ్యర్థిని గ్రూప్-1కు దరఖాస్తు చేయకున్నా హాల్‌టికెట్ జారీ అయిందంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. ఆ ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన అభ్యర్థినికి నోటీసు జారీచేయాలని నిర్ణయించింది. ఆమె గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేశారని, గతేడాది అక్టోబరు 16న నిజామాబాద్‌లోని ఏహెచ్‌ఎంవీ జూనియర్ కళాశాలలో పరీక్షకు హాజరయ్యారని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ వివరించారు. ఆయా రికార్డులు కమిషన్ వద్ద ఉన్నాయని చెప్పారు. జూన్ 11న జరిగిన పునఃపరీక్షకు కొత్తగా హాల్‌టికెట్లు జారీ చేశామని, ఈ అభ్యర్థిని గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయలేదంటూ వచ్చిన వార్త అవాస్తవమని స్పష్టంచేసింది.
Also Read:
TSPSC గ్రూప్ 3, 4 ఎగ్జామ్స్ పై స్టేకు హైకోర్టు నిరాకరణ- ప్రభుత్వానికి, టీఎస్ పీఎస్సీకి నోటీసులు
తెలంగాణలో ఇటీవల టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీల తరువాత ప్రస్తుతం పరీక్షలు మొదలయ్యాయి. అయితే గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ నిర్వహణపై స్టే ఇవ్వాలని కొందరు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు ఆ ఎగ్జామ్స్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జీవో 55, 136 కొట్టివేయాలని 101 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్న టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను ముందుగా ప్రకటించి, తరువాత తొలగించారని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, టీఎస్ పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. జూలై 13కి తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసింది. ఈ మేరకు సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. ఈ మేరకు జూన్ 9న అధికారిక ప్రకటన విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం కటాఫ్ మార్కులు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కటాఫ్ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్, ఇతర కేసుల వెరిఫికేషన్ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..