TSLPRB: ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ ఫలితాలపై సందేహాలుంటే నివృత్తికి అవకాశం, దరఖాస్తు ప్రారంభం
తుది రాత పరీక్ష రాసినా ఎంపిక కాలేకపోయిన అభ్యర్థులు తాము రాసిన పరీక్ష ఫలితాల విషయంలో సందేహాలుంటే స్పష్టత కోసం ఆగస్టు 7 నుంచి ఆగస్టు 9 వరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్‌ఐ, ఏఎస్ఐ పోస్టుల తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆగస్టు 6న వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలు ఎంపికయ్యారు. విద్యార్హతలు, రిజర్వేషన్, స్థానికత, వయసు, శారీరక దారుఢ్యం, రాత పరీక్షల ఫలితాల ఆధారంగా ఎంపిక చేసినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వివరించింది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు లాగిన్ వివరాలు నమోదుచేసి చూసుకోవచ్చు. అన్ని కేటగిరీల్లో ఎంపిక చేసిన పోస్టులకు సంబంధించి కటాఫ్ మార్కులను పొందుపరిచింది. అభ్యర్థుల నేపథ్యం, ప్రవర్తన, వైద్య పరీక్షలు, పెండింగ్ కేసుల పరిశీలన ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది.
పరీక్ష ఫలితాల విషయంలో సందేహాలుంటే స్పష్టత కోసం ఆగస్టు 7 నుంచి ఆగస్టు 9 వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసు నియామక బోర్డు సూచించింది. దీనికి ఫీజుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు, ఇతరులు రూ.3 వేలు చెల్లించాలని పేర్కొంది. వీటిపై వీలైనంత త్వరగా బోర్డు ఆన్‌లైన్‌ద్వారా సమాధానం ఇస్తుందని వివరించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభిప్రాయాలు నమోదుచేయాల్సి ఉంటుంది. మరే ఇతర విధానాల్లోనూ స్వీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది.
సెల్ఫ్ 'అటెస్టేషన్' తప్పనిసరి..
➥ ఎంపికైన అభ్యర్థులు మొదట టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి సెల్ఫ్ అటెస్టేషన్ ఫామ్‌ను ఆగస్టు 9 నుంచి 11 లోపు పూరించాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌ను నింపాక మూడు సెట్లు ప్రింట్ తీసుకుని ఒక్కో కాపీపై పాస్‌పోర్టు సైజు ఫొటోలు అతికించాలి. ఆ తర్వాత వీటిపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాల్సి ఉంటుంది.
➥ ఒకవేళ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికైనా దాన్ని వదులుకుంటామని ముందస్తుగా అంగీకార పత్రం, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన పత్రాలు ఆగస్టు 14న జోన్ల వారీగా డీఐజీ కార్యాలయాల్లో సమర్పించాలని వివరించింది.
బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాతే నియామక పత్రాలు..
తుది ఎంపిక జాబితాలో పేరున్నా... అప్పుడే ఉద్యోగపత్రం అందుకునే అవకాశం ఉండదు. తుది జాబితాకు ఎంపికైన సాధించిన అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, వ్యక్తిగత ప్రవర్తన, క్రిమినల్ కేసులపై ఆరా తీయనుంది. గరిష్ఠంగా పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. దీన్నిబట్టి ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు.. ఇలా అన్ని విభాగాలకు పంపనుంది. ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన నేపథ్యం, నేరచరిత్ర, ప్రవర్తన... తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను జిల్లాలవారీగా స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) చేపట్టనుంది. క్రిమినల్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్) డేటాను విశ్లేషించడంతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయి పరిశీలనపైనా ఎస్‌బీ దృష్టి సారించనుంది. విజేతల తాత్కాలిక, శాశ్వత చిరునామాల్లో పర్యటించి అక్కడి ఠాణాల్లో ఏమైనా కేసులున్నాయా...? అని పరిశీలించిన తర్వాత మండలికి నివేదిక పంపనున్నారు. ఆ నివేదికలో క్లీన్ చిట్ లభిస్తేనే ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటారు.
ALSO READ:
1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..