TSFSL recruitment 2021: టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో పలు ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ వివరాలివే..
తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 8వ తేదీతో ముగియనుంది.
తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగంలో 7, ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో 1 పోస్టును (మొత్తం 8 ఖాళీలు) భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 8వ తేదీతో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది. కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. మరిన్ని వివరాల కోసం https://www.tspolice.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఖాళీల వివరాలు..
సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ పోస్టులు- మూడు, బయాలజీ/సిరాలజీ పోస్టులు- రెండు, డీఎన్‌ఏ పోస్టులు- రెండు ఉన్నాయి. ఈ పోస్టులకు నెల వేతనం రూ.40,000గా నిర్ణయించింది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ పోస్టు- 1ని భర్తీ చేయనుంది. దీనికి నెల వేతనం రూ.15,000గా ఉంది.
వయసు, విద్యార్హత వివరాలు..
- 2021 జూలై 1 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారు దీనికి అర్హులని సంస్థ నోటిఫికేషన్‌లో తెలిపింది.
- బయాలజీ/సిరాలజీ, డీఎన్‌ఏ పోస్టులకు.. ఎంఎస్సీలో 70 శాతం ఉత్తీర్ణత లేదా బయోలజీ, జువాలజీ, బోటనీ, మైక్రో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బయో టెక్నాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్ (డీఎన్ఏలో స్పెషలైజేషన్) లో ఏదైనా ఒక సబ్జెక్టులో ఎంఎస్సీ చేసిన వారు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అర్హులని పేర్కొంది.
- ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఐటీ/కంప్యూటర్ సైన్స్/ఫోరెన్సిక్ సైన్స్ సబ్జెక్టులలో పీజీ లేదా ఎంసీఏ లలో 70 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు సైంటిఫిక్ అసిస్టెంట్ (కంప్యూటర్ ఫోరెన్సిక్) పోస్టులకు అర్హులని పేర్కొంది.
- ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు టెన్త్ విద్యార్హతగా ఉంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) ఉత్తీర్ణత సాధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పోస్టును బట్టి విద్యార్హత మారుతోంది. మరిన్ని విద్యార్హతలను నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
- రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయోపరిమితి, విద్యార్హతలలో సడలింపులు ఉన్నాయి.
- సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, మిగతా వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400, మిగతా వారు రూ.800 చెల్లించాలి.
దరఖాస్తుల స్వీకరణ ఇలా..
టీఎస్ పోలీస్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకున్నాక.. వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను ‘డైరెక్టర్ టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్, రెడ్‌హిల్స్, నాంపల్లి, హైదరాబాద్- 500004’ చిరునామాకు స్పీడ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి. లేదా పూర్తి చేసిన దరఖాస్తును నేరుగా టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయంలో కూడా అందజేయవచ్చు. నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియలలో ఏమైనా సందేహాలుంటే 040-23326252, 23307138 నంబర్లను సంప్రదించవచ్చని సంస్థ తెలిపింది.