TS DSC 2024: టీఎస్ డీఎస్సీ 2024లో ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయించారో తెలుసా? వివరాలు ఇలా
తెలంగాణలో 11,062 ఖాళీల భర్తీకి 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. జిల్లావారీగా పోస్టుల వివరాలు పరిశీలిస్తే.. అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో, అత్యల్ప ఖాళీలు పెద్దపల్లిలో ఉన్నాయి.
DSC 2024 Vacancies: తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT Posts)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్(School Assistants)-2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్(Laungage Pandi Posts)-727, పీఈటీలు(P.E.T. Posts)-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.
ఇక జిల్లావారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాజన్న సిరిసిల్ల (151), వనరపర్తి (152) ఉన్నాయి.
జిల్లాలవారీగా ఖాళీల వివరాలు..
మార్చి 4 నుంచి దరఖాస్తులు..
టీఎస్ డీఎస్సీ-2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన నేపథ్యంలో 46 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇంకా వెళ్లడించలేదు. త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు ప్రభుత్వం ఫిబ్రవరి 28న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాతపోస్టులకు కొత్తగా ఖాళీలను జతచేస్తూ తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటిచే ప్రకటించారు. అంటే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
గతేడాది విడుదల చేసిన డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉన్నది. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
సమస్య తలెత్తకుండా అధికారుల జాగ్రత్తలు..
రాష్ట్రంలోని నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.