TS DSC: తెలంగాణ డీఎస్సీ-2023 నోటిఫికేషన్ రద్దు? ఒకట్రెండు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్!
గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ.. మరికొన్ని పోస్టులను కలుపుతూ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Telangana DSC 2024 Notification: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ.. మరికొన్ని పోస్టులను కలుపుతూ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11 వేల టీచర్ పోస్టులను భర్తీచేసే అవకాశం ఉంది. ఇటీవలే గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాగా డీఎస్సీని కూడా రద్దుచేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది.
గత ప్రభుత్వం 5089 పోస్టులతో డీఎస్సీ-2023 నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. మొత్తం 1,76,530 మంది దరఖాస్తులు సమర్పించారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు అత్యధికంగా 60,190 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇందులో 1,79,297 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి 11 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Also Read: బీఈడీ అభ్యర్థులకు షాక్, ఎస్‌జీటీ పోస్టులకు అర్హతపై హైకోర్టు స్టే, ఆదేశాలు జారీ
ఎన్నికల కోడ్ వచ్చేలోపు నోటిఫికేషన్?
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు.. అందుకు తగిన విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. ప్రత్యేక అవసరాల పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఎన్)కు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి డీఎస్సీ నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి పోస్టింగులు..
వచ్చే ఏడాది జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి ఉపాధ్యాయులకు పోస్టింగులు పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఆలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించినట్టు సమాచారం. అయితే... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటీఫికేషన్ రద్దు చేస్తే సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించిన 5,089 పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు... ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు, డీఎస్సీకి ముడిపెడితే నియామకాలు పూర్తికావనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
ALSO READ:
ఏపీ డీఎస్సీ - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఏపీ డీఎస్సీ-2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అర్హతపై హైకోర్టు స్టే విధించిడంతోపాటు, దరఖాస్తు ప్రక్రియలో సర్వర్ సమస్యల కారణంగా గడువును పెంచారు. మరో మూడురోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఫిబ్రవరి 25న రాత్రి 12 గంటల వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..