TGPSC: అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
Group1 Mains Exam: తెలంగాణలో 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అక్టోబరు 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 21 నుంచి 28 మధ్య పరీక్షలు ఉంటాయి.
TGPSC Group1 Mains Halltickets: తెలంగాణలో 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రకటించింది. దీనిప్రకారం అక్టోబరు 21 నుంచి 27వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అయితే మధ్యాహ్నం 12:30 నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం1.30 తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అక్టోబరు 14 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో పొందుపరిచిన అన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను జులై 7న విడుదల చేశారు. ఇందులో 31,382 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరికి అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మెయిన్స్ పరీక్ష విధానం..
గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 06 పేపర్లు ఉంటాయి. వీటిని అభ్యర్థి ముందుగా ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది. పేపర్‌లో కొంత భాగాన్ని ఇతర భాషలో రాయడానికి అభ్యర్థికి అనుమతి లేదు.
గ్రూప్-1 మెయిన్స్ 2024 పరీక్షల షెడ్యూలు..
➥ 21.10.2024: జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)
➥ 22.10.2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)
➥ 23.10.2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
➥ 24.10.2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
➥ 25.10.2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
➥ 26.10.2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
➥ 27.10.2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)
మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 3.02 లక్షల మంది మాత్రమే (74 శాతం) ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ జులై 7న విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది.