TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
Telangana News: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 1,401 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
TGPSC Arrangements For Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలకు (Group 3 Exams) అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆది, సోమవారాల్లో పరీక్షలు జరగనుండగా.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్ శాంతికుమారి (CS Shanthikumari) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను కేటాయించగా.. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 1,375 పోస్టులకు పరీక్ష జరగనుంది. ఆదివారం రెండు పేపర్లు, సోమవారం ఒక పేపర్‌కు పరీక్ష నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ పేపర్ - 1 పరీక్ష జరగనుండగా.. రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పరీక్ష జరగనుంది. పరీక్షా సమయానికి అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లు క్లోజ్ చేయనున్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
అటు, హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు కలెక్టర్ అనుదీప్ కీలక సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లు క్లోజ్ చేస్తారని.. అభ్యర్థులు ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని భద్రంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ తెలిపింది. తొలిరోజు పేపర్ - 1 పరీక్షకు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. నియామక ప్రక్రియ ముగిసే వరకూ ప్రశ్నపత్రాలు, హాల్‌టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది.
టెట్ అభ్యర్థులకు అలర్ట్
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్‌లో తప్పులను సవరించే అవకాశం కల్పించింది. గతంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు www.schooledu.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా చెయ్యొచ్చు. ఇంకా ఏదైనా అదనపు సమాచారం కావాలంటే.. అభ్యర్థులు 7032901383, 9000756178 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించింది. దరఖాస్తులకు ఈ నెల 20 చివరి తేదీగా నిర్ణయించింది. జనవరి 1 నుంచి 20 వరకూ టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనుండగా.. ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.