Results: నియామక పరీక్షల ఫలితాల వెల్లడికి సర్కారు కసరత్తు, త్వరలో ఎంపిక జాబితాలు!
తెలంగాణలో ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ఉత్తర్వులు వెలువడగానే ఫలితాలు ప్రకటించనున్నారు.
TS Exam Results: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల (Recruitment Exams) ఫలితాల వెల్లడికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. ఈ ఉత్తర్వులు వెలువడగానే వారం నుంచి పది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖ, టీఎస్‌పీఎస్సీ, మహిళా సంక్షేమశాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధంచేశాయి. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దస్త్రాన్ని సీఎం రేవంత్‌కు పంపించాయి. ఆదివారం (ఫిబ్రవరి 4) మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడగానే త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలు వెలువడే అవకాశముంది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి..
మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్లు తెలిసింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమల్లో వారికి న్యాయమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది. తద్వారా నియామకాల్లో న్యాయవివాదాలకు పరిష్కారం చూపించినట్లు అవుతుందని భావిస్తోంది.
వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు..
నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది. టీఎస్‌పీఎస్సీ పరిధిలో యుద్ధప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, గ్రూప్-4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తికావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నాయి.
'గ్రూపు-1' పోస్టులు పెరుగుతున్నాయోచ్! 600 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్?
తెలంగాణలో గ్రూప్–1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 70కి పైగా పోస్టులను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 600 వరకూ ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు మరో 130 పోస్టులు ఖాళీ అవుతాయని అధికారులు తేల్చారు. ఇప్పటికే ఆయా శాఖలు ఖాళీల వివరాలను ఆర్థికశాఖకు సమర్పించినట్లు సమాచారం. అయితే ఆదివారం (ఫిబ్రవరి 4న) జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి, గ్రూపు-1 నోటిఫికేషన్‌పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా? త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా? అనే అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం కోరింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..