(Source: ECI/ABP News/ABP Majha)
TGPSC Exams: సీడీపీవో, ఈవో పోస్టుల రాతపరీక్షల తేదీలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
TGPSC: తెలంగాణ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ విభాగంలో సీడీపీవో, ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది.
TGPSC CDPO, EO Exams Schedule: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇటీవల రద్దుచేసిన సీడీపీవో, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ వెల్లడించింది. కొత్త షెడ్యూలు ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో సీడీపీవో పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక జనవరి 6, 7 తేదీల్లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ (CBRT) విధానంలోనే తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. సీడీపీవో, ఈవో పోస్టులకు నిర్వహించే పరీక్షలో పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి, పేపర్-2 సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డిగ్రీ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి.
సీడీపీవో పరీక్ష విధానం..
మొత్తం 450 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1(జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు-150 ప్రశ్నలు; పేపర్-2(సంబంధిత సబ్జెక్టు)కు 150 మార్కులు-300 ప్రశ్నలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు కేటాయించారు.
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష విధానం..
మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1(జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు-150 ప్రశ్నలు; పేపర్-2(సంబంధిత సబ్జెక్టు)కు 150 మార్కులు-150 ప్రశ్నలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు కేటాయించారు.
తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో (Notification No.13/2022), ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (Notification No.11/2022) పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. సీడీపీవో పోస్టులకు 19,182 మంది; ఈవో పోస్టులకు 26,751 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీడీపీవో పోస్టులకు 2023 జనవరి 3న, ఈవో పోస్టులకు జనవరి 8న కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన తుదికీలను సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అధికారులు అప్పుడు ఫలితాలను ప్రకటించలేదు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన కావడంతో.. సీడీపీవో పోస్టులకు 23 మందితో ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే ఈ పరీక్ష రద్దవడంతో ఎంపిక జాబితా కూడా రద్దు అయినట్లేనని టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. రద్దయిన పరీక్షల తేదీలను కమిషన్ తాజాగా ప్రకటించింది.
పోస్టింగుల సమయంలో పరీక్ష రద్దు..
అయితే గతంలో CDPO పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసినా.. అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదు. దీంతో ఈ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులు తమకు పోస్టింగులు ఇవ్వాలని కోర్డును ఆశ్రయించారు. అలాగే ఈ పరీక్ష విజయం సాధించని అభ్యర్థులు కూడా.. గ్రూప్-1 పరీక్షలాగా.. సీడీపీవో ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందని అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించారు. అలాగే గ్రూప్-1లో మాదిరిగా.. ఈవో పరీక్షలో బయోమెట్రిక్ తీసుకోలేదని, కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలు, అధికారుల నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దుచేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.