TS DSC Application Last Date: నేటితో ముగుస్తున్న 'డీఎస్సీ' దరఖాస్తు గడువు, ఇప్పటి వరకు 2.64 లక్షల దరఖాస్తులు
Telangana DSC: తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు ప్రక్రియ జూన్ 20తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు సాయంత్రం 5.50 గంటల వరకు ఫీజు చెల్లించి రాత్రి 11.50లోపు దరఖాస్తులు సమర్పించాలి.
TS DSC Appliacation Last Date: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన 'TG DSC - 2024' దరఖాస్తు ప్రక్రియ గురువారం(జూన్ 20)తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించలేనివారు జూన్ 20న సాయంత్రం 5.50 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 19న సాయంత్రం నాటికి 2,72,798 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా.. ఇందులో 2.64 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 'అప్లికేషన్ ఎడిట్' ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 64,556 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సవరించుకున్నారు. టెట్ ఫలితాలు విడుదలకావడంతో.. అభ్యర్థులు తమ టెట్ మార్కుల వివరాలు నమోదుచేసుకోవడం, ఇతర వివరాలు మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఏప్రిల్ 2తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. టెట్ నిర్వహణ తప్పనిసరి అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు టెట్ నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు గడువును ఏప్రిల్ 2 నుంచి జూన్ 20 వరకు పొడిగించారు. టెట్ ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచిన సంగతి తెలిసిందే.
వివరాలు..
* తెలంగాణ డీఎస్సీ - 2024
ఖాళీల సంఖ్య: 11,062.
➥ సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT): 6,508 పోస్టులు
➥ స్కూల్ అసిస్టెంట్: 2,629 పోస్టులు
➥ లాంగ్వేజ్ పండిట్: 727 పోస్టులు
➥ పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు): 182 పోస్టులు
➥ స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్): 220 పోస్టులు
➥ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్జీటీ) 796 పోస్టులు
అర్హతలు..
➥ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్ పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. బీఈడీ అర్హత ఉన్నవారు పోటీపడటానికి అవకాశంలేదు.
➥ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు (ఎస్‌ఏ) పోస్టులకు సంబంధిత బీఈడీ (మెథడాలజీ) పూర్తిచేసినవారు అర్హులు. నాలుగేళ్ల బీఈడీ పూర్తిచేసినవారు సైతం పోటీపడటానికి అవకాశముంది.
➥ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. దీంతోపాటు, యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
➥ బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
➥ తెలంగాణ, ఏపీ టెట్, లేదా సెంట్రల్ టెట్ (సీ టెట్)లో క్వాలిఫై అయి ఉండాలి.
➥ గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు.
➥ ఎస్టీ రిజర్వేషన్ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు.
➥ గతంలో లోకల్, ఓపెన్ కోటా రిజర్వేషన్ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలుచేస్తారు.
➥ అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతుల చదువును పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు.
➥ జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళతో భర్తీ చేస్తారు.
ALSO READ: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, డిగ్రీలో కనీస మార్కుల అర్హత శాతం తగ్గింపు
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18- 46 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.