TS DSC Application: డీఎస్సీ - 2023 'అప్లికేషన్ ఎడిట్' గడువు పెంపు, ఎప్పటివరకు అవకాశమంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ/డీఎస్సీ-2023) దరఖాస్తుల సవరణ గడువును పాఠశాల విద్యాశాఖ నవంబరు 8 వరకు పొడిగించింది.
తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ/డీఎస్సీ-2023) దరఖాస్తుల సవరణ గడువును పాఠశాల విద్యాశాఖ నవంబరు 8 వరకు పొడిగించింది. వాస్తవానికి దరఖాస్తుల సవరణ గడువు నవంబరు 5తో ముగియగా.. మరో మూడురోజులు అవకాశం కల్పించారు. డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు గత అక్టోబర్ 28న ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 1.77లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తంగా 1,79,297 మంది ఫీజు చెల్లించగా, సాయంత్రం వరకు 1,76,527 లక్షల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ), పీఈటీ, భాషా పండితులు, తదితర పోస్టులు మొత్తం 43 విభాగాల్లో 5,089 కొలువుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది. అత్యధికంగా ఎస్‌జీటీ తెలుగు మీడియం కోసం 60,190 మంది దరఖాస్తులు సమర్పించారు. అత్యల్పంగా లాంగ్వే్జ్ పండిట్ (ఉర్దూ) పోస్టులకు 328 దరఖాస్తులు మాత్రమే అందాయి. పరీక్షలను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది.
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
పోస్టులవారీగా అందిన దరఖాస్తుల వివరాలు..
➥ ఎస్‌జీటీ తెలుగు మీడియం - 60,190
➥ ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం - 2,735
➥ ఎస్‌జీటీ ఉర్దూ - 3,004
➥ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ తెలుగు మీడియం) - 27,872
➥ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ ఇంగ్లిష్ మీడియం) - 1,401
➥ స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్ తెలుగు మీడియం) - 22,531
➥ స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్ ఇంగ్లిష్ మీడియం) - 1,769
➥ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం) - 12,610
➥ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్ ఇంగ్లిష్ మీడియం) - 1,927
➥ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్సెస్ తెలుగు మీడియం) - 3,141
➥ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం) - 1,619
➥ స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) - 11,144
➥ స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) - 3,282
➥ స్కూల్ అసిస్టెంట్ (హిందీ) - 1,868
➥ లాంగ్వే్జ్ పండిట్ (తెలుగు) -9,620
➥ లాంగ్వే్జ్ పండిట్ (హిందీ) - 2,300
➥ లాంగ్వే్జ్ పండిట్ (ఉర్దూ) - 328
➥ పీఈటీ (తెలుగు మీడియం) - 6,253
➥ ఇతర పోస్టులకు అందిన దరఖాస్తులు - 2933.
పరీక్ష స్వరూపం ఇలా..
➥ పరీక్షల తేదీలతోపాటు, పరీక్ష స్వరూపాన్ని కూడా విద్యాశాఖ వెల్లడించింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్‌ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను తెలిపింది.
➥ ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్‌లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు.
➥ పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది.